- అనుమతులు లేకుండా సీతమ్మసాగర్ కడుతున్నారని అభ్యంతరాలు
- సర్కారు ఇచ్చే పరిహారం సరిపోదంటున్న నిర్వాసితులు
- ఎకరానికి 32 లక్షలు ఇవ్వాలని డిమాండ్
భద్రాచలం,వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద నిర్మిస్తున్న సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం మీద వివాదం రాజుకుంది. పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ బ్యారేజీ పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఆదేశాలు ఇచ్చింది. అయినా, ప్రభుత్వం పనులు కొనసాగించడం పట్ల నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని వారు కోరుతున్నారు. అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్ బ్యారేజీకి పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు లేవని, తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాన్ని ప్రారంభించిందని తెల్లం నరేశ్, బూర లక్ష్మీనారాయణ అనే గిరిజన రైతులు చెన్నైలోని ఎన్జీటీని ఆశ్రయించారు. అడవులతో పాటు విలువైన వనరులు ముంపునకు గురవుతాయని, తక్షణమే పనులు నిలిపివేసేలా ఆర్డర్ ఇవ్వాలని కోరారు. దీంతో బ్యారేజీ పనులు ఆపాలంటూ ఎన్జీటీ మార్చి 24న ఉత్తర్వులు జారీ చేసింది, తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. పిటీషనర్లు ఉత్తర్వు కాపీలు అశ్వాపురం తహశీల్దారు ఆఫీసులో అందజేశారు. అయినా పనులు కొనసాగుతుండడంతో శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఎన్జీటీ ఆర్డర్కాపీలను ఇచ్చారు. పనులు ఆపించాలని వారు కోరారు.
వరద జలాలను వాడుకునేందుకు..
సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు సీతారామ లిఫ్ట్స్కీమ్ ద్వారా సాగునీరు, మిషన్ భగీరథ కింద తాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. కాటన్దొర కట్టిన ఆనకట్టకు 200 మీటర్ల దిగువన దుమ్ముగూడెం వద్ద రూ.3480కోట్ల అంచనా వ్యయంతో బ్యారేజీ నిర్మించనున్నారు. బ్యారేజీ బ్యాక్ వాటర్ వల్ల అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ముప్పు ఉండకుండా కరకట్టలు నిర్మించాలని ప్లాన్ చేశారు. కుడివైపు 40 కిలోమీటర్లు, ఎడమవైపు 56 కిలోమీటర్లు మేర కరకట్ట కడతారు. ఇందుకోసం 3,123 ఎకరాల భూములు అవసరమని లెక్క తేల్చిన ప్రభుత్వం భూసేకరణ ప్రారంభించింది.
పరిహారం పెంచాలంటూ ఆందోళనలు
సీతమ్మసాగర్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న భూములకు మెరుగైన పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 8 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.32లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు దుమ్ముగూడెం మండలంలోని కాశీనగరం, సున్నంబట్టి తదితర గ్రామాలు పూర్తిగా నీటమునుగుతున్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించలేదు. చాలామంది రైతులు పరిహారం తీసుకునేందుకు నిరాకరిస్తున్నా బలవంతంగా అంటగడుతున్నారు. దీంతో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు. నిర్వాసితులకు ప్రతిపక్ష పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది.
మళ్లీ ఎన్జీటీని ఆశ్రయిస్తాం: పిటీషనర్లు
బ్యారేజీ నిర్మాణం విషయంలో భద్రాచలం మన్యం ప్రజలను ప్రజలను మభ్యపెడుతోందని పిటీషనర్లు తెల్లం నరేశ్, బూర లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టుకు అనుబంధంగా బ్యారేజీ నిర్మిస్తున్నట్టు చెప్పి., అక్కడ 320 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టు కూడా కడుతుందన్నారు. మొదట రూ.3480కోట్లు ఖర్చుతాయని అంచనా వేయగా..ప్రస్తుతం దాని అంచనా రూ.18,500కోట్లకు పెంచారన్నారు. బ్యారేజీ వల్ల ముంపు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందన్నారు. గ్రామసభల్లో వాస్తవాలు వివరించి, నిర్వాసితులు కోరుతున్న పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్జీటీ ఇచ్చిన ఆర్డర్‌ను అధికారులు ఖాతరు చేయడం లేదని, కరకట్టల నిర్మాణానికి ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు. వెంటనే పనులు ఆపకపోతే మళ్లీ ఎన్జీటీకి వెళ్తామన్నారు.
ఆఫీసర్లతో మాట్లాడినం
సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం వల్ల నష్టపోతున్న నిర్వాసితులకు పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వారికి రూ.32లక్షలు ఇవ్వాలి. ఇప్పుడిచ్చేది సరిపోదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోతే ఆందోళన చేస్తాం. ఇప్పటికే ఆఫీసర్లతో మాట్లాడినం. పర్మిషన్లు కూడా లేకుండా కడుతున్నరు. గిరిజనులకు నష్టం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
- పొదెం వీరయ్య, ఎమ్మెల్యే,భద్రాచలం