బీసీ లెక్కలపై దుమారం! కులగణన సర్వే పైనా అనుమానాలు

బీసీ లెక్కలపై దుమారం! కులగణన సర్వే పైనా అనుమానాలు
  • బీసీ లెక్కలపై దుమారం!
  • పదేండ్లలో బీసీలు 52 శాతం నుంచి  46 శాతానికి ఎలా పడిపోతారని ప్రశ్న
  • సమగ్ర కులగణన సర్వే పైనా అనుమానాలు.. 2011 సెన్సస్​తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే!
  • గత నెల ఓటర్​లిస్ట్​తో పోల్చినా పొంతన కుదరని  లెక్కలు
  • నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్​
  • అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సర్కారు ప్రకటించిన సమగ్ర కులగణన  వివరాలు, అందులోని  బీసీ లెక్కలపై  దుమారం నెలకొన్నది. 2014లో 1.85 కోట్లుగా ఉన్న బీసీ జనాభా గడిచిన పదేండ్లలో పెరగాల్సింది పోయి 21 లక్షలకుపైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 52 శాతంగా ఉన్న బీసీల జనాభాను 46 శాతానికి కావాలనే తగ్గించారని పలువురు బీసీ మేధావులు, ప్రొఫెసర్లు,  ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి, నివేదికపై చర్చించాలని డిమాండ్​చేశారు. ఈ క్రమంలో సమగ్ర కులగణన సర్వే తీరుపైనా పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 2011 సెన్సస్ ప్రకారం  రాష్ట్ర జనాభా 3 కోట్ల 50 లక్షలు కాగా, గడిచిన14 ఏండ్లలో పాపులేషన్​ కేవలం 20 లక్షలే ఎలా పెరుగుతుందని నిలదీస్తున్నారు. గత నెలలో ప్రకటించిన ఫైనల్​ఓటర్ల జాబితాకు, తాజాగా ప్రకటించిన జనాభా వివరాలకు సైతం ఎక్కడా పొంతన కుదరడం లేదని అంటున్నారు. 

గణాంకాలపై గందరగోళం

కేబినెట్​ సబ్​కమిటీకి అందిన సర్వే రిపోర్ట్​ ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల70 లక్షల జనాభా ఉంది. ఇదే విషయాన్ని  మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదివారం ప్రకటించగా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2011 సెన్సస్​ ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల 50 లక్షల జనాభా ఉంది. ఈ జనాభా లెక్కలు నిర్వహించి14 ఏండ్లు గడుస్తున్నాయి. ఇన్నేండ్లలో కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల దాకా జనాభా పెరిగి ఉంటుందని, ఈ లెక్కన రాష్ట్ర జనాభా 4  కోట్ల నుంచి 4 .20 కోట్లకు చేరుతుందని అందరూ భావించారు. 

కానీ అనూహ్యంగా ఈ 14 ఏండ్లలో కేవలం 20 లక్షల జనాభా మాత్రమే పెరగడం విస్మయానికి గురిచేసింది. అంతేకాదు, గత నెల 6న ప్రకటించిన తుది ఓటరు లిస్టు ప్రకారం రాష్ట్రంలో 3 కోట్ల35 లక్షల 27 వేల 925 మంది ఓటర్లు ఉన్నారు.  ఈ లెక్కన  ఓటు హక్కు లేని18 ఏండ్ల లోపు పిల్లలు కేవలం 35 లక్షల మందే ఉండాలి. కానీ అంగన్ వాడీలు,​ స్కూళ్లు, జూనియర్​కాలేజీల్లో ఎన్ రోల్​అయిన విద్యార్థుల సంఖ్యే ఏకంగా 80 లక్షల దాకా ఉందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా స్కూలుకు వెళ్లని చిన్నారులు, ఓటర్​లిస్టులో పేరు నమోదుచేసుకోని వాళ్లను కలిపితే కోటి దాకా ఉండొచ్చు. అంటే ఏరకంగా చూసినా రాష్ట్ర జనాభా 4  కోట్ల20 లక్షలకు పైమాటే! కానీ ఆఫీసర్ల  సర్వేలో ఏకంగా 50 లక్షల దాకా జనాభా తగ్గడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పట్టణాల్లో సర్వేపై అనుమానాలు..

2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా కారణంగా చేయలేదు.  దీంతో ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి జనాభా లెక్కలుగానీ, కులాలవారీ వివరాలుగానీ అందుబాటులో లేవు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్​ సర్కారు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ.. ఆ వివరాలు​ బయటపెట్టలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేసి, లోకల్​బాడీల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్​హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నిరుడు సెప్టెంబర్ 6న​ నిరంజన్​ చైర్మన్​గా నలుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్​ను ఏర్పాటుచేసింది. తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్ రావు చైర్మన్​గా, బీసీ గురుకుల సెక్రటరీ సైదులును సెక్రటరీగా బీసీ డెడికేటెడ్​ కమిషన్ ను నియమించింది. నవంబర్​ 6 నుంచి డిసెంబర్​10 వరకు ప్లానింగ్​ కమిషన్​ ఆధ్వర్యంలో  ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024’ పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రజలు ఈ సర్వేలో  ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో, ముఖ్యంగా జీహెచ్​ఎంసీలో పబ్లిక్​ సహకరించలేదని, చాలా మంది వివరాలు ఇవ్వలేదని, ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పారని స్వయంగా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు చెప్పారు. 

సీఎం రేవంత్​ రెడ్డి సైతం సర్వేలో పాల్గొనని పలువురు ప్రముఖులపై అసహనం వ్యక్తంచేశారు. అదీగాక జీవనోపాధి కోసం పల్లెల నుంచి నగరాలకు వచ్చి, అద్దె ఇండ్లలో ఉంటున్నవారిని సర్వే టీమ్​లు కనీసం పలకరించలేదనే విమర్శలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే అసలు కులగణన సిబ్బంది తమ ఇండ్ల వైపు కన్నెత్తిచూడలేదని పలుచోట్ల పబ్లిక్​ ఆరోపించారు. పోనీ ఇలాంటి వారు తమ గ్రామాలకైనా వెళ్లి కుటుంబ వివరాలు ఇచ్చారా? అంటే అదీ లేదు. ఇలా ఏరకంగా చూసినా సర్వే అసమగ్రంగా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోసారి కులగణన నిర్వహించాలి

2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 52 శాతంగా ఉంటే కాంగ్రెస్​ ప్రభుత్వం కావాలనే 46 శాతానికి తగ్గించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్​కృష్ణయ్య ఆరోపించారు. ఏకంగా 6 శాతాని కిపైగా జనాభాను తగ్గించి చూపారని ఆయన మండిపడ్డారు. హైదరా బాద్​లో ఇంటింటి సర్వే నిర్వహించలేదని, ప్రభుత్వం మరోసారి  కులగణన నిర్వహించాలని కృష్ణయ్య డిమాండ్​చేశారు. బీసీల జనాభాను పథకం ప్రకారం 21 లక్షలకు తగ్గించారని సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ మేధావులు ఆరోపించారు. సర్కారుకు దమ్ముంటే జనాభా లెక్కలను కులాలవారీగా గ్రామ పంచాయతీల్లో డిస్​ప్లే చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఇటు ప్రతిపక్ష నేతలు కూడా బీసీ లెక్కలపై కాంగ్రెస్​ప్రభుత్వాన్ని టార్గెట్​చేశారు. కేవలం ఓసీ జనాభాను మాత్రమే పెంచి చూపి మిగతావన్నీ తగ్గించారని, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా, 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా ప్రస్తుత జనాభా లెక్కలు సరిపోలడం లేదని బీఆర్ఎస్​ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కుల గణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపించారని,  దీనిపై  అసెంబ్లీలో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే పాయల్​శంకర్​హెచ్చరించారు. కాగా, కులగణన  సర్వేలో పాల్గొనని కేటీఆర్​, హరీశ్​రావుకు, జస్టిస్ ఈశ్వరయ్య, వకుళాభరణం కృష్ణ మోహన్ లాంటి బీసీ లీడర్లకు తమను విమర్శించే హక్కులేదని మంత్రి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. కావాలనే కొంత మంది సర్వేలో పాల్గొనలేదని, అలాంటి వారు ఇప్పటికైనా తమ వివరాలు అధికారులకు సమర్పించాలని ఆయన సూచించారు. 

వాడీవేడి చర్చ

బీసీ లెక్కలపై వాడీవేడి చర్చ జరుగుతున్నది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా కోటి 64  లక్షలు(46.25 శాతం ) ఉన్నట్టు మంత్రి ఉత్తమ్​ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో  జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్ట్​ను బయటపెట్టారు. పాత, కొత్త నివేదికలను పక్కపక్కన పెట్టి సోషల్​ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా కోటి 85 లక్షల 61 వేల 856గా ఉంది. ఈ లెక్కన గడిచిన పదేండ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షలకుపైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు
ప్రశ్నిస్తున్నారు.