![ఒడవని పంచాయితీ .. నడిగడ్డలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో వివాదాలు](https://static.v6velugu.com/uploads/2025/02/controversy-over-distribution-of-double-bedroom-houses-in-nadigadda_oO7m2DZe0S.jpg)
- తాజాగా 84 మందిని అనర్హులుగా గుర్తించిన ఆఫీసర్లు
- లక్కీ డిప్లో వచ్చిన పేర్ల తొలగింపుతో మరోసారి లొల్లి
గద్వాల, వెలుగు: డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేదలకు పంచడం పక్కన పెడితే.. గద్వాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుడు నుంచి వాటిని పంచే వరకు వివాదాలే కొనసాగుతున్నాయి. సర్వేలు, ఎంక్వైరీలు చేసి లక్కీ డిప్ తీసి లిస్ట్ ఫైనల్ చేసిన ఆఫీసర్లు, తాజాగా 84 మంది అనర్హులు ఉన్నట్లు పేర్కొంటూ పేర్లు తొలగించడం వివాదానికి దారితీస్తోంది. బీఆర్ఎస్ హయంలో గద్వాలలోని దౌదర్పల్లి దర్గా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం నిరుపేదలకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇండ్ల పట్టాలు గుంజుకొని ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇంటి స్థలం పట్టాదారులు, ప్రతిపక్ష లీడర్లు ఆందోళనలు చేశారు. నిర్మాణాలు కంప్లీట్ అయిన తరువాత వాటి కేటాయింపులో కూడా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
రెండేండ్ల నుంచి పెండింగ్..
గద్వాల టౌన్ పరిధిలోని దౌదర్పల్లి దర్గా దగ్గర గత సర్కార్ 1,275 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. వాటి పంపిణీ కోసం 2023లో అప్లికేషన్లు తీసుకున్నారు. మొదటి విడతలో 4,800 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్ల వెరిఫికేషన్ కోసం అప్పటి కలెక్టర్ వార్డుల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసి అర్హుల జాబితాను వార్డు సభలు పెట్టి ప్రదర్శించారు. అర్హుల జాబితాలో చాలా మంది పేర్లు రాలేదని లొల్లి జరిగింది. దీంతో మళ్లీ దరఖాస్తులు స్వీకరించగా, 989 అప్లికేషన్లు వచ్చాయి.
మొదటి, రెండో విడత కలిపి వచ్చిన 5,189 దరఖాస్తులను మళ్లీ పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య 2023 ఏప్రిల్ 15న 771 ఇండ్లకు లక్కీ డిప్ తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిన 504 ఇండ్లను ప్లాట్లు కోల్పోయిన వారికి ఇవ్వాలని పక్కన పెట్టారు. ఎన్నికలు రావడంతో ఇండ్ల కేటాయింపును నిలిపివేశారు. దీంతో రెండేండ్లుగా ఇండ్ల కేటాయింపు పెండింగ్లో ఉంది.
84 మంది పేర్లు తొలగింపుతో..
లక్కీ డిప్లో ఎంపికైన 771 మంది లబ్ధిదారుల్లో 84 మంది అనర్హులు ఉన్నట్లు ఇటీవల గుర్తించి వారి పేర్లను తొలగించారు. 84 మందిలో ఇదివరకే 72 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, మిగిలిన వారిలో ఒకే కుటుంబంలో ఇద్దరి పేర్లు ఉండడం, ఆధార్ కార్డులో అడ్రస్ వేర్వేరుగా ఉండడం తదితర కారణాలతో తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే గతంలో రెండుసార్లు ఎంక్వైరీ చేశారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తాము ఇప్పటికీ కిరాయి ఇండ్లల్లోనే ఉంటున్నామని, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో కూడా తమ పేరు రాలేదని వాపోతున్నారు. ఇలా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటి నుంచి వివాదాలే..
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో మొదటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. 2012లో సర్వే నంబర్ 968, 969, 980, 983, 984 తదితర సర్వే నంబర్లలో కాంగ్రెస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే డీకే అరుణ నిరుపేదలకు ఇంటి స్థలాలకు పట్టాలిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో బలవంతంగా నిరుపేదల పట్టాలు గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టగా లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన దీక్షలు చేశారు. అయినప్పటికీ అప్పటి సర్కార్ మొండిగా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది.
దీంతో 600 మంది ప్లాట్లు కోల్పోయిన బాధితులు కోర్టుకు వెళ్లగా, ప్లాట్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అవకాశం కల్పించాలని ఆర్డర్ ఇచ్చింది. దీంతో 1,275 ఇండ్లలో కొన్ని పక్కనపెట్టారు. లక్కీ డిప్లో ఎంపికైన వారికి ఇండ్లు ఎప్పుడు కేటాయిస్తారోనని ఎదురు చూస్తున్న క్రమంలో 84 మంది అనర్హులు ఉన్నారని పేర్కొనడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇందిరమ్మ ఇల్లు రాలే..
డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అప్లికేషన్ పెట్టుకుంటే లక్కీ డిప్ లో ఇల్లు వచ్చింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు రానప్పటికీ, డబుల్ బెడ్రూమ్ క్యాన్సిల్ చేశారు. ఇల్లు కేటాయించి న్యాయం చేయాలి.
టి. లావణ్య, తెలుగుపేట
కిరాయి ఇంట్లో ఉంటున్నా..
లక్కీ డిప్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా ఇవ్వలేదు. చాలా రోజుల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా క్యాన్సిల్ చేశారు. ఎప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉండాలా?
మణెమ్మ, గద్వాల