
- స్పష్టమైన పంచ్‌లు కొట్టినా ఇండియా బాక్సర్ నిశాంత్‌కు ఓటమే
న్యూఢిల్లీ: అమ్మాయిల బాక్సింగ్ పోటీలకు అబ్బాయిలను అనుమతించిందంటూ విమర్శలపాలైన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ).. బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇండియా బాక్సర్ నిశాంత్ దేవ్ (71 కేజీ) క్వార్టర్‌ఫైనల్ బౌట్ స్కోరింగ్ సిస్టమ్‌ను తప్పుబట్టిన మాజీ బాక్సర్లు పతకాన్ని దోచేశారని విమర్శించారు.
‘ఈ బౌట్ స్కోరింగ్ సిస్టమ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. చాలా గొప్ప ఫైట్. బాధపడొద్దు నిశాంత్ బాగా ఆడావు’ అంటూ ఇండియా లెజెండరీ బాక్సర్ విజేందర్ సింగ్ ట్వీట్ చేశాడు. 2020 టోక్యో గేమ్స్‌లో వివాదాస్పదంగా ఓడిన మేరీకోమ్.. రివ్యూ, నిరసన తెలపడం వంటి అంశాలు బాక్సింగ్‌లో లేకపోవడం అత్యంత బాధాకరమైందని ఆక్రోశించింది.1960 రోమ్ ఒలింపిక్స్‌లో తొలిసారి బాక్సింగ్ బౌట్‌పై వివాదం తలెత్తినా ఐవోసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
1988 సియోల్ ఒలింపిక్స్‌లో అమెరికన్ బాక్సర్ రాయ్ జోన్స్.. పార్క్ సి హున్ (కొరియా) మధ్య జరిగిన 71 కేజీల బౌట్ బాక్సింగ్ కమ్యూనిటీని ఊపేసింది. ఈ బౌట్‌లో జోన్స్ 86 పంచ్‌లు కొట్టగా, 32 పంచ్‌లు కొట్టిన కొరియా బాక్సర్‌ను విన్నర్‌గా ప్రకటించారు. దీంతో ఇద్దరు బాక్సర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, క్వార్టర్స్ బౌట్‌లో ఓడటంతో ఒలింపిక్స్‌లో మెడల్ గెలవాలన్న తన కల పీడకలగా మారిందని ఇండియా బాక్సర్ నిశాంత్ వాపోయాడు. ‘ఒలింపిక్స్ కలను సాకారం చేసుకోవడానికి నేను ఎంతో శ్రమించా. ఎన్నో గంటలు దీనికి అంకితం చేశా. లక్ష్యం వైపు అడుగు వేసేందుకు చాలా త్యాగం చేశా. కానీ ఒక్క క్షణం నా నుంచి అన్నింటిని దూరం చేసింది. ఈ ఓటమి నన్ను చాలా బాధించింది. జడ్జిల స్కోరు విన్నప్పుడు నా శరీరంలో ఏమీ మిగల్లేదనే భావన కలిగింది’ అని నిశాంత్ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు