కేయూ ప్రొఫెసర్ల ప్రమోషన్లలో అక్రమాలు! .. వీసీ, రిజిస్ట్రార్ ప్రమోషన్ల​పై వివాదం

  •  వారే నోటిఫికేషన్ ఇచ్చి.. వారి దరఖాస్తులు వాళ్లే  స్ర్కూటీని చేసుకున్నరు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ జరుగుతుండగానే.. కాకతీయ యూనివర్సిటీలోనూ వైస్ చాన్స్​లర్, రిజిస్ట్రార్ రూల్స్​కు విరుద్ధంగా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్లు పొందడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) జనరల్ సెక్రటరీ హైకోర్టును ఆశ్రయించారు. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించి 7 నెలలు అవుతున్నా వీసీ, రిజిస్ట్రార్ ఇంకా దాఖలు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓయూ వీసీ, మిగతా ప్రొఫెసర్లకు అర్హత లేకున్నా ప్రమోషన్లు ఇవ్వడంపై ప్రభుత్వం విచారణ కమిటీ వేసిన నేపథ్యంలో కేయూ వీసీ, రిజిస్ట్రార్ అక్రమ పదోన్నతులపై కూడా ఎంక్వైరీ జరపాలని స్టూడెంట్లు డిమాండ్ చేస్తున్నారు.

నోటిఫికేషన్ ఇచ్చుకొని.. అప్లై చేసుకున్నరు

గతేడాది జులై, ఆగస్టు, నవంబర్ లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కోసం అప్లై చేసుకోవాలని కోరుతూ కేయూ రిజిస్ట్రార్ వేర్వేరు సర్క్యులర్లు జారీ చేశారు. అర్హత కలిగిన టీచర్లు దరఖాస్తులు సమర్పించారు. వీసీగా ఉన్న సోషియాలజీ ప్రొఫెసర్ రమేశ్, రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ ​కోసం అప్లై చేసుకున్నారు. వాస్తవానికి వీసీ, రిజిస్ట్రార్ ప్రమోషన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే నోటిఫికేషన్ తేదీ నుంచి చివరి వరకు వీసీ, రిజిస్ట్రార్లు తమ పదవుల్లో ఉండకూడదనే రూల్ ఉంది. ప్రభుత్వం లేదా గవర్నర్ ఇన్​చార్జ్ వీసీని నియమించాల్సి ఉంది. అలాగే ఇన్ చార్జ్ రిజిస్ట్రార్​ను నియమించాలి. కానీ ప్రస్తుత వీసీ, రిజిస్ట్రార్ నోటిఫికేషన్​ను వారే జారీ చేసుకొని వారే దరఖాస్తు ఫారాలను సమర్పించుకొని, వారే అప్లికేషన్ స్క్రూటీని చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌గా ప్రమోషన్​ కోసం 16 మందికి, సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కు ఆరుగురికి కాల్ లెటర్లు పంపి గతేడాది డిసెంబర్ 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూలు చేశారు. 16 మందిలో 14 మందికి ప్రొఫెసర్ ప్రమోషన్, ఆరుగురిలో ఐదుగురికి సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులను డిసెంబర్ 28 రాత్రి 11 గంటలకు ఇవ్వగా అదే టైమ్​లో ప్రమోషన్ వచ్చిన టీచర్లు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. కేవలం వీసీరమేశ్​తన పదవీ విరమణకు ఒకరోజు ముందే తాను సీనియర్ ప్రొఫెసర్ అయ్యేటట్లు ప్లాన్ ప్రకారమే ఇంటర్వ్యూలు, రిజల్ట్స్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ తౌటం శ్రీనివాస్​కు, సెక్రటరీ డాక్టర్ మామిడాల ఇస్తారికి అన్ని అర్హతలు ఉన్నా వ్యక్తిగత కక్షలతో ప్రమోషన్ నిలిపివేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.