నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం తరలింపుపై రగడ మొదలైంది. ప్లేయర్లకు ప్రత్యామ్నాయం చూపకపోవడం పట్ల క్రీడా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని స్టేట్, నేషనల్ ప్లేయర్ల కోచింగ్ కోసం ఉన్న ఒకే ఒక్క స్టేడియం కూల్చివేయడంతో ప్రాక్టీస్ చేసుకోలేక పోతారన్నారు. నగరాభివృద్ధి పేరిట పాత భవనాలు కూల్చివేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్, తహసీల్దార్, డీఈవో, ఆర్డీవో, ఇరిగేషన్ శాఖ ఓల్డ్ క్వార్టర్లతో పాటు మినీ స్టేడియం కూల్చివేతకు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ స్థలాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కళాభారతి ఆడిటోరియం నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే స్టేడియం కూల్చివేత నిర్ణయంపై క్రీడాసంఘాలు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయం ఎక్కడ..?
1975లో రూ.6 లక్షల వ్యయంతో జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ అథారిటీ మైదానం నిర్మించారు. 1999లో దానిని మినీ స్టేడియంగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లా స్కూల్ స్పోర్ట్స్ మీట్స్, రూరల్ స్పోర్ట్స్, ప్లేయర్స్ కోచింగ్‌కు ఈ గ్రౌండ్ ఉపయోగపడుతోంది. నగరంలో ప్లేయర్లకు అందుబాటులో ఉన్న మరో గ్రౌండ్ ఖలీల్ వాడీలో 2012లో జనరల్ హాస్పిటల్ నిర్మించారు. అప్పటి నుంచి క్రీడాకారులకు మినీ స్టేడియం ఒక్కటే పెద్దదిక్కుగా మారింది. జిల్లాలకు స్టేట్, నేషనల్ ప్లేయర్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు మినీ స్టేడియం ఓ వేదిక. 1990లో రాజారాం స్టేడియం నిర్మించారు. కానీ ఈ స్టేడియం జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్లేయర్స్ అక్కడికి వెళ్లడం లేదు. 1998లో స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ ఇండియా అర్చరీ అకాడమీని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ప్లేయర్లు శిక్షణ పొందేవారు. కానీ అర్చరీ అకాడమీ తరలిపోవడంతో రాజారాం స్టేడియం నిరూపయోగంగా మారింది. కేవలం స్పోర్ట్స్ మీట్స్‌కే ఈ స్టేడియం పరిమితమైందిజ నగరంలో అందుబాటులో ఉన్న మినీ స్టేడియం కూల్చి వేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్లేయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్టేడియం కూలిస్తే ఊరుకోం..
అభివృద్ధి పేరిట మినీ స్టేడియాన్ని కూల్చివేస్తే ఊరుకోం. స్టేడియం ప్రాంతంలో కళాభారతి నిర్మించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇక్కడ శిక్షణ పొందుతున్న ప్లేయర్లు నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్నారు.
- వేణురాజ్, ఎన్ఎస్‌యూఐ జిల్లా ప్రెసిడెంట్
పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం..
జిల్లాలో ఉన్న ఖలీల్ వాడీ గ్రాండ్‌లో హాస్పిటల్ నిర్మించారు. పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో ఇతరులకు అనుమతి ఉండదు. ఉన్న మినీ స్టేడియాన్ని కూడా కూల్చేస్తే ప్లేయర్లు శిక్షణకు ఆరేడు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. మినీ స్టేడియాన్ని తరలిస్తే క్రీడా సంఘాల తరఫున ఉద్యమిస్తాం.
- బొబ్బిలి నర్సయ్య, ఒలంపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి