మునుగోడులో వివాదాస్పదంగా రాష్ట్ర ఎన్నికల అధికారుల వ్యవహారం

  • గుట్టుగా రోడ్డు రోలర్​ సింబల్​ తొలగించిన ఆర్వో జగన్నాథ్​రావు 
  • కేంద్ర ఎన్నికల సంఘం ఫైర్​.. ఆర్వోపై వేటు
  • ప్రలోభాలు, డూప్లికేట్​ ఓట్లపై నోరువిప్పని సీఈవో వికాస్​రాజ్
  • మంత్రి మందు పోస్తున్న ఫొటోలు బయటకొచ్చినా నో రెస్పాన్స్​
  • ​ఈవీఎం బ్యాలెట్​లో గుర్తుల వరుసపైనా అభ్యంతరాలు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు బై పోల్​ నిర్వహణ గందరగోళంగా మారింది. షెడ్యూల్​ వచ్చిన నాటి నుంచే రాష్ట్ర ఎన్నికల అధికారుల తీరు వివాదాస్పదమవుతూ వస్తున్నది. వేల సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు, బోగస్​​ఓటర్లపై ఒకవైపు రచ్చ జరుగుతుండగానే.. మరోవైపు ఎన్నికల గుర్తుల కేటాయింపు వ్యవహారమూ విమర్శలకు దారితీస్తున్నది. రిటర్నింగ్​ అధికారి (ఆర్వో) జగన్నాథ్​రావు వ్యవహరించిన తీరుపై ఏకంగా  కేంద్ర ఎన్నికల కమిషన్  సీరియస్  అవ్వాల్సి వచ్చింది. ఎన్నికల నియమావళికి  విరుద్ధంగా ఆర్వో ప్రవర్తించారని కమిషన్​ తప్పుబట్టింది. జగన్నాథ్​రావును తొలగించి.. ఆయన స్థానంలో  మిర్యాలగూడ ఆర్డీవో బి.రోహిత్ సింగ్​ను గురువారం అపాయింట్​ చేసింది. వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కమిషన్​ అండర్​ సెక్రటరీ సంజయ్​ కుమార్​ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్​రాజ్​ను ఆదేశించారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా లిక్కర్​ పంపిణీ జరుగుతున్నా, కోడ్​ ఉల్లంఘనలు కొనసాగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

కేటాయించిన సింబల్​కు బదులు ఇంకోటి ఇచ్చి

మునుగోడు బై ఎలక్షన్​కు కేటాయించిన ఫ్రీ సింబల్​ ‘రోడ్డు రోలర్’​పై రిటర్నింగ్​ ఆఫీసర్​ జగన్నాథ్​రావు తనకు తాను నిర్ణయం తీసుకుని మార్చడం వివాదానికి దారి తీసింది. జనరల్​ అబ్జర్వర్​ సమక్షంలో కేటాయించిన సింబల్​ను కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆర్డర్ లేకుండానే, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆయన మార్చేశారు. అది కూడా అభ్యర్థి నామినేషన్​ పేపర్​లో సూచించని సింబల్​ను కేటాయించారు. దీనిపై సంబంధిత అభ్యర్థి నుంచి వచ్చిన కంప్లయింట్​ ఆధారంగా సెంట్రల్​ ఎలక్షన్​ కమిషన్​తీవ్రంగా స్పందించింది. వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికారులను రిపోర్ట్​ అడిగి చర్యలు చేపట్టింది. మునుగోడులో మొత్తం 130 మంది నామినేషన్లు వేయగా.. విత్​ డ్రా ముగిసే సరికి బరిలో 47 మంది క్యాండిడేట్లు నిలిచారు. ఇందులో నేషనల్​ పార్టీలు, రీజినల్​ పార్టీలు,  రిజిస్టర్​ అయి అన్​రికగ్నైజ్డ్​గా ఉన్న పార్టీల తరఫున అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. రికగ్నైజ్డ్​ పార్టీలకు ఎన్నికల గుర్తులు ఉండగా.. ఇండిపెండెంట్లకు, ఆన్​ రికగ్నైజ్డ్​ పార్టీలకు రిటర్నింగ్​ ఆఫీసర్​ అందుబాటులో ఉన్న సింబల్స్​ను కేటాయించాల్సి ఉంటుంది. మునుగోడులో యుగ తులసి పార్టీ నుంచి పోటీలో ఉన్న కె.శివకుమార్​కు ఆయన నామినేషన్​ పేపర్​లో ఫస్ట్​ ప్రియారిటీగా పొందుపరిచిన ‘రోడ్డు రోలర్​’ను కేటాయించారు. ఈ నెల 17న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన జనరల్​ అబ్జర్వర్​ సమక్షంలో రిటర్నింగ్​ అధికారి ఈ ప్రక్రియ ముగించారు. అప్పుడే అభ్యర్థి శివకుమార్​ సంతకం తీసుకుని కన్ఫర్మ్​ కూడా చేశారు. ఆ తర్వాత క్యాండిడేట్​కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, జనరల్​ అబ్జర్వర్​ దృష్టికి తీసుకెళ్లకుండానే ఆర్వో జగన్నాథం ‘రోడ్డు రోలర్’​ సింబల్​ను తొలగించి.. ‘బేబీ వాకర్’ సింబల్​ను కేటాయించారు. దీనిపై శివకుమార్​ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. సీఈవో వికాస్​ రాజ్​ నుంచి పూర్తి రిపోర్ట్​ తెప్పించుకొని ఆర్వో జగన్నాథంను మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. శివ కుమార్​కు డ్రాలో దక్కిన ‘రోడ్ రోలర్’ గుర్తును తిరిగి కొనసాగిస్తూ ఫారం 7 ఏ ను సవరించాలని స్పష్టం చేసింది. సవరించిన ఫారం 7 ఏ ను తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రచురించి,  తమకు నివేదిక పంపాలని స్పష్టం చేసింది.

డూప్లికేట్ ​ఓట్లపై నోరు విప్పుతలే!

ఎప్పుడూ లేని విధంగా మునుగోడు బై ఎలక్షన్​ కోసం కొత్తగా వేల సంఖ్యలో ఓటర్లు నమోదు చేసుకోవడం దగ్గర నుంచే రాష్ట్ర ఎన్నికల అధికారుల తీరుపై విమర్శలు షురూ అయ్యాయి. ఏకంగా 24,781 మంది మనుగోడులో కొత్తగా ఓటు కోసం అప్లయ్​ చేసుకున్నారు. ఈ స్థాయిలో ఒక నియోజకవర్గంలో ఓటరు అప్లికేషన్లు రావడం ఇదే మొదటిసారి. దీనిపై బీజేపీ ముందు నుంచే సీఈవో వికాస్​రాజ్​కు కంప్లయింట్​ చేస్తూ వచ్చింది. హైకోర్టుకు కూడా వెళ్లింది. సీఈవో పరిధిలోని అంశం కావడంతో కోర్టు అప్పటికప్పుడు ఎలాంటి డైరెక్షన్​ ఇవ్వలేదు. అప్లికేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే ఆమోదం తెలిపారని.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన అప్లికేషన్లకూ ఆమోదం తెలిపి ఓటు హక్కు కల్పించారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మునుగోడులో విచ్చలవిడిగా డూప్లికేట్​ ఓట్లు నమోదయ్యాయి. వాటిపై సీఈవోకు కంప్లయింట్​ వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డూప్లికేట్​ ఓట్లున్నవారిని  గుర్తించి ఓటు వేయకుండా ఆపుతారా? అంటే సీఈవో వికాస్​రాజ్​ నోరు విప్పడంలేదు. ఇదే విషయమై గురువారం ఆయనను మీడియా కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. నిరాకరించారు.

మందు పోస్తున్న ఫొటోలు బయటకొచ్చినా..!

మునుగోడులో ప్రలోభాలపై రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా మంత్రి మల్లారెడ్డి మునుగోడులో క్యాంపెయిన్​ చేస్తూ మందు పోస్తున్న ఫొటోలు బయటకు వచ్చినా దానిపై సీఈవో వికాస్​రాజ్​ స్పందించలేదు. సుమోటోగానైనా ఉల్లంఘన కేసు నమోదు చేసే అవకాశం ఉన్నా.. లిక్కర్​ పంపిణీ, మంత్రి మల్లారెడ్డి ఇష్యూ తన దృష్టికి రాలేదని ఆయన తీసిపారేశారు. మంత్రులు ప్రచారంలో పాల్గొంటే.. కాన్వాయ్​ను వాడుకోవడానికి వీల్లేదు. అయితే పోలీసుల బందోబస్తు, భారీ కాన్వాయ్​లతోనే మంత్రులు క్యాంపెయిన్​ చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల అధికారులు అభ్యంతరం చెప్పడం లేదు. అదే టైంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల వాహనాలను చెక్​ చేయడం, ఇతర కారణాలతో అడ్డుకోవడంతో ఎన్నికల విధుల్లో రాష్ట్ర ఆఫీసర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

నాది బ్యాలెట్​లో ఐదో స్థానం రావాలె

ఈవీఎం బ్యాలెట్​ పేపర్​లోనూ అధికా రులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నరు. నిబంధనల ప్రకారం నాకు ఐదో స్థానం రావాలి. యుగ తులసి పార్టీ రిజిస్టర్​ పార్టీ. నా ఇనిషియల్​ ‘కె’ ప్రకారం కాకుండా.. పేరులోని ‘ఎస్’​ ప్రకారం బ్యాలెట్​ పేపర్​లో నాకు స్థానం కేటా యించినట్లు చెప్తున్నరు. అందరికీ ఇం టి పేరు పరిగణనలోకి తీసుకుని నాకు మాత్రం పేరును పరిగణనలోకి తీసుకొని కేటాయించడం ఏమిటి? దీనిపై ఈసీకి కంప్లయింట్​ చేసిన. బ్యాలెట్​ ప్రింటింగ్​ ఆపాలని కోరిన. ఇప్పటికే గుర్తు విషయంలో అన్యాయం చేస్తే.. ఈసీ కలుగజేసుకుని న్యాయం చేసింది. ఇప్పు డు కూడా తగిన నిర్ణయం తీసుకోవాలి. - కె.శివకుమార్​, యుగ తులసి పార్టీ అభ్యర్థి

ప్రభుత్వాలకు ఆఫీసర్లు విధేయత చూపుతున్నారు

ఈసీకి సొంతంగా స్టాఫ్​ ఉండదు. వాళ్లు రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్ల మీద ఆధారపడతారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు ఆ అధికారులను కంట్రోల్​లో పెట్టుకుంటున్నాయి. రాజ్యాంగానికి కాకుండా వారు ప్రభుత్వాలకు విధేయత చూపెడుతు న్నారు. మునుగోడులోనూ అదే జరు గుతున్నది. ‘రోడ్డు రోలర్’​ సింబల్​ విషయంలోనూ ఇదే జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక సజావుగా జరగదని తెలిసిపోతున్నది. ఓటర్లను లీడర్లు ప్రలోభ పెడుతున్నా.. ఆ కథనాలు మీడియాలో విస్తృతంగా వస్తున్నా.. సీఈవో తన  దృష్టికి రాలేదనడం ఏమిటి?  - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్​ గుడ్​గవర్నెన్స్​

బ్యాలెట్​లో టీఆర్​ఎస్​కు రెండో స్థానం

ఈవీఎం బ్యాలెట్​ పేపర్​లో ముద్రించిన పార్టీలు, క్యాండిడేట్ల వరుస క్రమంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రిప్రంజేటేషన్ ​ఆఫ్ ​పీపుల్​ యాక్ట్​ 1951, సెక్షన్​ 38 ప్రకారం  రికగ్నైజ్డ్​ నేషనల్​ పార్టీల అభ్యర్థులు, రికగ్నైజ్డ్ ​ స్టేట్ ​పార్టీల అభ్యర్థులు, రిజిస్టర్డ్​ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లను వరుసగా బ్యాలెట్ ​పేపర్​లో ముద్రించాల్సి ఉంటుంది. ఇందులో కూడా అల్ఫాబేట్​ ఆర్డర్​ను ఫాలో కావాలి. అయితే.. మునుగోడు బైపోల్​లో మొదటి స్థానం బీఎస్పీకి, రెండో స్థానం టీఆర్​ఎస్​కు, మూడో స్థానం బీజేపీకి, నాల్గో స్థానం కాంగ్రెస్​కు కేటాయించారు. దీనిపై పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రీజినల్​ పార్టీ అయిన టీఆర్ఎస్​ కు రెండో స్థానం ఎట్లా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. వరుసగా బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్​ ఆ తర్వాత టీఆర్ఎస్​కు స్థానం కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక  రోడ్డు రోలర్​ గుర్తు వచ్చిన యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్​కు 14వ స్థానం ఇచ్చారు. తనకు ఐదో స్థానం రావాల్సి ఉన్నా ఇలా చేయడం ఏమిటని శివకుమార్​ ప్రశ్నించారు.