కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దు: బాల్క సుమన్‌

  • కావాలనే కొందరిని ఆ పార్టీలోకి పంపాం
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం

చెన్నూరు, వెలుగు:‘‘కాంగ్రెసోళ్లు మనోళ్లే. వాళ్లని ఏమనొద్దు. కొంతమందిని మనమే పంపినం. అందరూ మన దగ్గరికే వస్తారు’’అని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ బీఆర్‌‌ఎస్ టికెట్ మరోసారి సుమన్‌కు ప్రకటించిన తర్వాత శనివారం ఆయన మంచిర్యాల జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జైపూర్ మండలం నుంచి చెన్నూరు వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. 

అనంతరం చెన్నూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లంతా మనవాళ్లేనని, గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్లను ఎవరూ ఏమీ అనొద్దని బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. గత ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్ నేత ఆ తర్వాత బీఆర్‌‌ఎస్‌లో చేరారని, అలాగే కాంగ్రెస్ వాళ్లు అందరూ వస్తారన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం కొంత మందిని మనమే కావాలని పంపించామని పేర్కొనడం గమనార్హం. దీంతో బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది.