ప్రకృతి రిసార్ట్స్, కన్వెన్షన్​సెంటర్ కూల్చివేత

ప్రకృతి రిసార్ట్స్, కన్వెన్షన్​సెంటర్ కూల్చివేత
  • కోమటికుంట పరిధిలో నిర్మాణాలపై హైడ్రా యాక్షన్​
  • శంషాబాద్, నార్సింగి, తెల్లాపూర్​ పరిధిలో హోర్డింగుల తొలగింపు​

హైదరాబాద్ సిటీ/శామీర్​పేట, వెలుగు: నగరంలో కొన్ని అక్రమ నిర్మాణాలు, హోర్డింగులను హైడ్రా గురువారం కూల్చివేసింది. మేడ్చల్- జిల్లా తూముకుంట‌‌ మున్సిపాలిటీ పరిధి దేవ‌‌ర‌‌యాంజ‌‌ల్ లోని కోమ‌‌టికుంట‌‌లో అక్రమ క‌‌ట్టడాల‌‌ను తొలగించింది. ఎఫ్‌‌టీఎల్ ప‌‌రిధిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపింది. 

చెరువు ప‌‌రిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్‌‌, ప్రకృతి క‌‌న్వెన్షన్ కు అనుమ‌‌తులు లేవ‌‌ని నోటీసులిచ్చింది. దీంతో వాటి యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం కూడా అక్రమ నిర్మాణాలే అని తేల్చడంతో తమకు కూల్చుకోవడానికి 30 రోజుల టైం కావాలని కోరారు. గడువు దాటినా తొల‌‌గించ‌‌కపోవ‌‌డంతో గురువారం హైడ్రా రంగంలోకి దిగి కూల్చేసింది.  

శివారులో 53 హోర్డింగులు ..

శంషాబాద్‌‌, కొత్వాల్‌‌గూడ‌‌, నార్సింగి, తొండుప‌‌ల్లి, గొల్లప‌‌ల్లి రోడ్డు, తెల్లాపూర్  మున్సిపాలిటీల్లో అనుమ‌‌తి లేకుండా రోడ్లకు రెండువైపులా ఏర్పాటు చేసిన హోర్డింగులను హైడ్రా తొల‌‌గించింది. శుక్రవారం నుంచి గురువారం వ‌‌ర‌‌కూ 53 హోర్డింగులను తొలగించామని హైడ్రా స్పష్టం చేసింది. యూనిపోల్స్ 35, యూని స్ట్రక్చర్స్ 4,  ఇంటి పై క‌‌ప్పుల‌‌పైన పెట్టిన 14 హోర్డింగ్స్​తీసేశామన్నారు.  

అనుమ‌‌తులుంటే తొల‌‌గించం : హైడ్రా చీఫ్​ రంగ‌‌నాథ్‌‌

హోర్డింగులను తొలగిస్తుండడంతో పలువురు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు గురువారం హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్‌‌ ను క‌‌లిశారు. దీంతో ఆయన వారికి సమాధానమిస్తూ అనుమ‌‌తులున్న హోర్డింగులు, యూనిపోల్స్,  యూని స్ట్రక్చర్స్​తొలగించమని హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్  ఏవీ రంగ‌‌నాథ్‌‌ స్పష్టం చేశారు. శివారు మున్సిపాలిటీల ప‌‌రిధిలో అనుమ‌‌తులు లేని వాటిని తామే తొలగించుకుంటామని, 10 రోజులు టైం కావాలని కోరారు. దీనికి హైడ్రా చీఫ్​గ‌‌తంలోనే టైం ఇచ్చామ‌‌ని, స్పందించకపోవడంతో హైడ్రా తొలగిస్తోందని స్పష్టం చేశారు.