ప్యారానగర్​ డంప్​ యార్డు రద్దు చేయాలి : కన్వీనర్​ రాజయ్య

ప్యారానగర్​ డంప్​ యార్డు రద్దు చేయాలి : కన్వీనర్​ రాజయ్య
  • పీసీబీ ఆఫీస్​ ముందు ప్రజా సంఘాల ఐక్య వేదిక ధర్నా

రామచంద్రాపురం, వెలుగు: ప్యారానగర్​ డంప్​యార్డు ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాల పోరాట ఐక్య వేదిక కన్వీనర్​ రాజయ్య డిమాండ్ చేశారు. మంగళవారం రామచంద్రాపురంలోని పీసీబీ ఆఫీసు ముందు ఐక్య వేదిక ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య సమస్య లేదని తప్పుడు ప్రచారం చేస్తూ డంపిండ్ యార్డుకు పర్మిషన్​ ఇవ్వడం అర్ధరహితమన్నారు.

గ్రామ సభలు పెట్టకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా డంప్​ యార్డు ఏర్పాటు ప్రక్రియను ఎలా ప్రారంభిస్తారని అధికారులను ప్రశ్నించారు. నల్లవల్లి ప్యారానగర్​లో డంపింగ్ యార్డు పెడితే 15 కిలో మీటర్ల మేర జల, వాయు కాలుష్యం అవుతుందని, దీనివల్ల ప్యారానగర్​ మరో జవహర్ నగర్​ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం కాదని తప్పుడు నివేదికలు ఇస్తున్న పీసీబీ అధికారులు వారం రోజులు జవహర్​ నగర్​ డంప్​ యార్డు వద్ద ఉండి రావాలన్నారు.

నెల రోజులుగా డంప్​ యార్డు ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే డంప్​యార్డు రద్దుకు పీసీబీ అధికారులు సిఫారసు చేయాలని లేని పక్షంలో పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఆఫీసును దిగ్భందం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నాగేశ్వర్​రావు, రాంరెడ్డి, రాములు, వెంకటేశ్వర్ రావు, సురేశ్, రమణయ్య, వీరస్వామి, జయరాం, నరేందర్​ పాల్గొన్నారు.