
బండి బయటికి తీస్తే.. ఓ వైపు పెట్రోల్ ఖర్చు, మరోవైపు పొల్యూషన్ . పెట్రోల్‌తో నడిచే బైక్‌లు అటు జేబుకు, ఇటు ఆరోగ్యానికి చిల్లు పెడుతున్నాయి. అమ్మేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామంటే సగం ధర కూడా పలకదు. అలాంటప్పుడుఏం చేయాలి? అంటే పాత పెట్రోల్ బండినే ఈవీగా మార్చుకోవాలి అంటోంది శివశంకరి. అలా మార్చేందుకే ఆమెఏఆర్4 టెక్ పేరుతో ఒక స్టార్టప్ పెట్టింది.ఇక్కడ తక్కువ ఖర్చుతోనే పెట్రోల్ బండ్లనుఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేస్తున్నారు.
గ డిచిన కొన్నేండ్లలో ఈవీ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయ్యింది. కానీ.. కంపెనీలన్నీ కొత్త వెహికల్స్ తయారుచేయడంపైనే దృష్టి పెట్టాయి. శివశంకరి మాత్రం పాత పెట్రోల్ వెహికల్స్‌ని ఈవీలుగా మార్చాలి అనుకుంది. అనుకున్నట్టుగానే రూ. 39,900కే పెట్రోల్ బైక్‌లను రెట్రోఫిటింగ్ సొల్యూషన్‌తో ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మారుస్తోంది. దీనిద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నదే ఆమె లక్ష్యం.
కష్టాల ప్రయాణం
శివశంకరి కాంచీపురానికి దగ్గర్లోని తక్కోలం అనే మారుమూల గ్రామంలో పుట్టింది. ఆ ఊళ్లో చదువుకోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవు. వాళ్ల నాన్న మాత్రం ఎలాగైనా తన కూతుళ్లను బాగా చదివించాలి అనుకున్నాడు. శివశంకరితోపాటు తన అక్కను గ్రాడ్యుయేషన్ చేయించాడు.
వాళ్ల ఫ్యామిలీలో వీళ్లే మొదటి మహిళా గ్రాడ్యుయేట్లు. శివశంకరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటెక్ చేసి, లెక్చరర్‌గా జీవితాన్ని మొదలుపెట్టింది. తర్వాత ఎంట్రపెన్యూర్‌గా మారి పట్టు చీరలు అమ్మడం, హెర్బల్ హెయిర్ ట్రీట్మెంట్ బిజినెస్ లాంటివి చేసింది. కానీ.. అంతలోనే కరోనా రావడంతో తన వెంచర్లకు ఫుల్స్టాప్ పడింది.
మళ్లీ ఉద్యోగం..
బిజినెస్‌లు మూసేసిన తర్వాత కరోనా టైంలోనేకోయంబత్తూరుకు వెళ్లింది. అక్కడ ఎలక్ట్రిక్ టూవీలర్స్ కోసం మోటార్లు తయారుచేసే ఈఎంఎఫ్ ఇన్నోవేషన్స్‌లో ఆపరేషన్స్ మేనేజర్‌గా చేరింది. కంపెనీలో మంచి టీమ్‌ని రెడీ చేసి బిజినెస్ పెరిగేలా చేసింది. తాను లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం వల్ల స్టూడెంట్స్కెపాసిటీని ఈజీగా గుర్తించగలుగుతుంది. అందుకే మంచి టీమ్‌ని బిల్డ్ చేయగలిగింది.
కానీ.. కొన్నాళ్లకు ఆ కంపెనీ శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ అనే కంపెనీలో విలీనం అయ్యింది. తర్వాత కూడా కొంతకాలం అక్కడే పనిచేసింది. ఆ తర్వాత సొంతంగా ఏఆర్4 టెక్ పేరుతో కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. ఈఎంఎఫ్లో కలిసి పనిచేసిన మహేష్ పాండే కూడా ఆమెకు తోడయ్యాడు. కంపెనీకి కావాల్సిన పెట్టుబడిని మెంటార్, ప్రొఫెసర్ సీసీ హాంగ్ అందించాడు. ఈఎంఎఫ్లో ఇండియన్ రోడ్ల కోసం మోటార్ డిజైన్ చేసిన టీమ్‌కి శివశంకరి హెడ్‌గా పనిచేసింది. ఆ ఎక్స్‌పీరియెన్స్ ఆమె కంపెనీ పెట్టినప్పుడు బాగా పనికొచ్చింది.
ఈవీలుగా..
ప్రధానంగా మామూలు టూవీలర్(ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్) వెహికల్స్‌ని రూ. 39,900 ఖర్చుతో రెండు గంటల్లోనే ఈవీలుగా మార్చడమే ఏఆర్4 కంపెనీ ప్రత్యేకత. అందుకే కంపెనీకి ఆపేరు పెట్టారు. ఏఆర్4లో ఏ అంటే ఆటోమోటివ్, నాలుగు ఆర్లు.. రిపేర్, రిఫర్బిష్, రీపర్పస్, రీసైకిల్ అనే పదాలను సూచిస్తాయి.
ముఖ్యంగా హోండా యాక్టివా, టీవీఎస్ జెస్ట్ లాంటి ఫేమస్ టూవీలర్ మోడల్స్‌ని మార్చేందుకు అప్రూవల్స్ రావడంతో వాళ్లు తయారుచేసే కిట్‌కి డిమాండ్ బాగా పెరిగింది. ‘నో–వెల్డ్, నో–గ్రైండ్, నో–కట్, నో–డ్రిల్ విధానంలో ఇంజిన్ని తీసేసి, సింపుల్‌గా ప్లగ్-అండ్-ప్లే పద్ధతిలో బ్యాటరీ కిట్‌ను బిగిస్తారు.
కొత్తగా మార్కెటింగ్
ఏఆర్4 టెక్ కంపెనీ ఎక్కువగా టైర్ 3, 4 సిటీల్లోనే మార్కెటింగ్ చేస్తోంది. ఒక మార్కెటింగ్ టీం వారానికోసారి పొల్లాచ్చి, కరూర్, తిరుప్పూర్ లాంటి చుట్టుపక్కల పట్టణాలకు వెళ్తుంది. స్థానిక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర, స్కూల్స్, కాలేజీలు, ప్రజలు ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో వాళ్ల రెట్రో ఫిటింగ్ ఈవీల గురించి వివరిస్తారు. నేరుగా కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుంటారు.
సవాళ్లు
శివశంకరికి కంపెనీ పెట్టగానే సక్సెస్ రాలేదు. స్టార్టప్ పెట్టాలని నిర్ణయించు కున్నప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. ఇలాంటి కంపెనీలు పెట్టాలంటే ఏఆర్ఏఐ(ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), రాష్ట్ర రవాణా సంస్థ నుంచి పర్మిషన్లు తీసుకోవాలి. కానీ.. అది అంత ఈజీ కాదు. అందుకోసం శివశంకరి చాలా కష్టపడింది. ఆ తర్వాత రెట్రో ఫిటింగ్ కోసం టీమ్‌ని నిర్మించడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఈ రంగంపై అవగాహన ఉన్నవాళ్లు చాలా తక్కువ. వాళ్లను వెతికి పట్టుకోవడం పెద్ద టాస్క్. అందుకే కొంతమంది లోకల్వాళ్లను రిక్రూట్ చేసుకుని వాళ్లకే ట్రైనింగ్ ఇప్పించింది. పైగా కంపెనీలో 25 శాతం మంది ఉద్యోగులు మహిళలే. ‘‘ప్రారంభంలో బైక్ పార్ట్స్‌ని విడదీయడం కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఈజీగా విడదీస్తున్నా.”అని ఏఆర్4 టెక్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న తంగామణి చెస్తోంది.
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
స్టార్టప్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టారు. ఆటోమోటివ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వరల్డ్ స్కిల్ కౌన్సిల్ ధృవీకరించిన మూడు నెలల డిప్లొమా కోర్సులు అంది స్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి స్కిల్స్ నేర్పించారు. వీటన్నింటి వల్ల కంపెనీ చాలా స్పీడ్‌గా డెవలప్ అవుతోంది.
గత సంవత్సరం కంపెనీకి రూ. 1.67 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం రూ. 4 కోట్లకు వరకు వస్తుందని అంచనాలు ఉన్నాయి. ‘‘భవిష్యత్తులో ట్రాక్టర్లను కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత బస్సులు, ట్రక్కులకు కూడా విస్తరిస్తాం” అంటోంది శివశంకరి.
సొంతంగా మోటార్లు..
పెట్రోల్ వెహికల్స్‌ని ఈవీలుగా మార్చే క్రమంలో అవసరమయ్యే పరికరాల కోసం ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడకుండా సొంతంగానే తయారుచేసుకుంటున్నారు. వాళ్లు డిజైన్ చేసుకున్న మోటార్లనే వాడుతున్నారు. సోడియం–అయాన్ బ్యాటరీ ప్యాక్‌ల తయారీకోసం ప్లాంట్ ఏర్పాటుచేసుకున్నారు. అది తమిళనాడులోనే మొదటి ప్లాంట్.
ప్రస్తుతం కంపెనీ రెట్రోఫిట్టింగ్ చేసిన వెహికల్స్ ఒక్క చార్జ్‌తో 50 కిలోమీటర్లు వెళ్తాయి. 40 కి.మీ/గం స్పీడ్‌తో ప్రయాణించగలవు. మోటారు, బ్యాటరీపై మూడు సంవత్సరాలు, కంట్రోలర్‌పై సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 800కు పైగా పెట్రోల్ బైక్‌లను ఈవీలుగా మార్చారు. బైక్‌లే కాదు.. పాత టాటా దోస్త్ ట్రక్‌లను కూడా ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్ట్‌లుగా మార్చారు.