హైదరాబాద్, వెలుగు: దొంగను ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ యువతి అతడిని వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేసింది. కొన్నాళ్లకు అతడిని కూడా వదిలేసి మరో దొంగను ప్రేమించి సహజీవనం మొదలుపెట్టింది. అయితే ఆమె ప్రియుడు ఓ కేసులో జైలుకు వెళ్లడంతో, అతనికి బెయిల్ ఇప్పించేందుకు సదరు యువతి కానిస్టేబుల్ అవతారమెత్తింది. జాబ్ ఇప్పిస్తానని నమ్మించి ఓ నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ ఫేక్ కానిస్టేబుల్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన గుడిసెల అశ్విని(24) ఇంటర్ వరకు చదువుకుంది. ఇండ్లలో చోరీలు చేసే రోహిత్ శర్మ అనే దొంగను ప్రేమించి పెండ్లి చేసుకుంది.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత రోహిత్, అశ్విని మధ్య గొడవలు జరిగాయి. దీంతో అశ్విని భర్తను విడిచిపెట్టింది. రోహిత్ సింగ్ అనే వ్యక్తితో కొంతకాలం సహజీవనం చేసింది. కొన్నిరోజులకు అతడిని కూడా వదిలేసి బైక్‌ల దొంగ అభిషేక్‌ను ప్రేమించి.. అతడితో కలిసి ఉంటోంది. వీరిద్దరూ జల్సాలకు బానిసయ్యారు. అభిషేక్ఇటీవల బైక్ చోరీల కేసులో అరెస్టయి.. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు. దీంతో అశ్వినికి కుటుంబ పోషణ భారంగా మారింది. అభిషేక్‌ను బెయిల్‌పై బయటికి తీసుకొచ్చేందుకు, జల్సాలకు డబ్బుల కోసం పోలీస్ కానిస్టేబుల్ అవతారమెత్తింది.
ఇందుకోసం అశ్విని కానిస్టేబుల్ యూనిఫామ్ కుట్టించుకుంది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నానని చెప్పుకుంటూ లంగర్ హౌస్‌కు చెందిన నిరుద్యోగి రాకేశ్ నాయక్‌తో పరిచయం పెంచుకుంది. నాంపల్లి కోర్టులో సీనియర్ అడ్వకేట్ వద్ద జాబ్ ఇప్పిస్తానని రాకేశ్‌కు చెప్పి అతడి నుంచి రూ.30 వేలు వసూలు చేసింది. తర్వాత అశ్విని కనిపించకపోవడంతో రాకేశ్ లంగర్‌హౌస్ పీఎస్‌లో కంప్లయింట్ చేశాడు. నిఘా పెట్టిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ యూనిఫాం, బ్యాడ్జీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించారు.