చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష
  • రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
  • ఐదేండ్ల బాలికను పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం, హత్యచేసిన వలస కార్మికుడు
  • 2017లో నార్సింగిలో ఘటన

హైదరాబాద్, వెలుగు: నగరంలోని నార్సింగిలో ఐదేండ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు ఉరిశిక్ష విధించింది. 2017లో నార్సింగిలో చిన్నారిపై సెంట్రింగ్‌‌‌‌ కార్మికుడు దినేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ కిరాతకానికి పాల్పడిన ఘటన అప్పట్లో  సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు 2021లో ఉరిశిక్ష విధించగా.. ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశాడు. 

అతడి పిటిషన్‌‌‌‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఉరి శిక్షను సవాల్​ చేస్తూ దినేశ్​కుమార్‌‌‌‌ దాఖలు చేసిన అప్పీల్​ను డిస్మిస్‌‌‌‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కింది కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు ఖరారు చేసిన తొలి కేసు ఇదే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ఉరిశిక్షను ఆమోదించిన కేసు కూడా ఇదే.  

చాక్లెట్​కొనిస్తానని ఆశచూపి..

మధ్యప్రదేశ్​రాష్ట్రం కలిమతి గ్రామానికి చెందిన దినేశ్​​కుమార్​(23) హైదరాబాద్​కు వలస వచ్చి, అల్కపురిటౌన్​షిప్​ సమీపంలోని ఆర్యమిత్ర లేబర్​ క్యాంప్​లో నివాసం ఉంటూ సెంట్రింగ్​ వర్క్​ చేస్తున్నాడు. 2017 డిసెంబర్​ 12న సమీపంలో నివాసం ఉండే ఓ బాలిక(5)కు దినేశ్​కుమార్​చాక్లెట్​కొనిస్తానని ఆశచూపాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నార్సింగిలోని షిర్డీ సాయి ప్రేమ్​సమాజ్​హాస్పిటల్​సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, అత్యాచారం చేశాడు.

అనంతరం ఆమెను హత్యచేశాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. దినేశ్​కుమార్​పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా, బాలికను రేప్​ చేసి చంపేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో దినేశ్​కుమార్​ను అరెస్ట్​ చేసి, రిమాండ్​కు తరలించారు.ఈ కేసులో  సైంటిఫిక్​ ఎవిడెన్స్​కలెక్ట్ చేసిన నార్సింగి పోలీసులు 90 రోజుల్లో కోర్టులో చార్జ్​షీట్​ ఫైల్​ చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లా కోర్టు నిందితుడు దినేశ్​కుమార్​కు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ దినేశ్​ హైకోర్టును ఆశ్రయించాడు.  ఈ కేసును విచారించిన  హైకోర్టు నిందితుడు వేసిన పిటిషన్​ను కొట్టివేసి, మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.