
బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో మిస్టరీ వీడింది. భార్య, అత్త కలిసి అతనిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతని వయసు 37 సంవత్సరాలు కాగా, భార్య వయసు 19 సంవత్సరాలు. అత్త వయసు 37 సంవత్సరాలు. భర్తను హత్య చేసిన భార్యను, ఆమె తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. లోక్నాథ్ (37), యశస్విని (19) మధ్య పెళ్లికి ముందే రెండేళ్లు రహస్య బంధాన్ని కొనసాగించారు. 2024లో ఈ ఇద్దరూ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే.. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం యశస్విని కుటుంబానికి తెలియకుండా దాచారు.
ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉండటంతో వీళ్ల పెళ్లికి అమ్మాయి ఫ్యామిలీ ఏమాత్రం ఒప్పుకోలేదు. అయితే.. పెళ్లయిన విషయం దాచేసి యశస్వినిని ఆమె పుట్టింట్లో ఉంచేసి లోక్నాథ్ బెంగళూరు వెళ్లిపోయాడు. లోక్నాథ్కు బెంగళూరులో పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని యశస్వినికి తెలిసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలు సమసిపోయి కాస్త కాపురం గాడిన పడిందనుకునే సమయంలో లోక్ నాథ్లో ఉన్న శాడిస్ట్ యశస్వినికి నరకం చూపించాడు.
అత్తను.. అంటే యశస్విని తల్లిని తనతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఒప్పించాలని భార్యపై లోక్నాథ్ ఒత్తిడి తీసుకొచ్చాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయి యశస్విని పుట్టింటికి వెళ్లిపోయింది. కాల్ చేసి కూడా అత్తను అందుకు ఒప్పిస్తే ముగ్గురం హ్యాపీగా కలిసి ఉందామని లోక్ నాథ్ టార్చర్ చేశాడు. భర్త అరాచకం రోజురోజుకూ పెరిగిపోవడంతో విసిగివేసారిపోయి ఇక చంపేయాలని తల్లితో కలిసి యశస్విని ప్లాన్ చేసింది. సరిగ్గా అదే టైంలో.. మార్చి 22న యశస్వినికి లోక్ నాథ్ కాల్ చేశాడు. శనివారం ఉదయం కలవడానికి తాను వస్తున్నానని చెప్పాడు. ఉదయం 10 గంటలకు SUV వాహనంలో ఇంటి నుంచి లోక్ నాథ్ బయల్దేరి వెళ్లాడు. లోక్నాథ్ను చంపేయడానికి ఇదే సరైన సమయమని యశస్విని, ఆమె తల్లి భావించారు.
ALSO READ | ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. భద్రతా దళాల చేతిలో ముగ్గురు మావోయిస్టులు హతం
లోక్నాథ్ వచ్చేలోపు అతని కోసం ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఆ ఫుడ్లో నిద్ర మాత్రలు పొడి చేసి మిక్స్ చేశారు. పార్టీ చేసుకోవాలని డిసైడ్ అయిన లోక్ నాథ్ కొన్ని బీర్ బాటిల్స్ కొనుక్కుని మరీ భార్యను కలవడానికి వెళ్లాడు. యశస్వినిని కారులో ఎక్కించుకున్నాడు. యశస్విని ఆ ఫుడ్ ను కూడా తన వెంట తీసుకెళ్లింది. లోక్ నాథ్ తన భార్యను తీసుకుని BGS లేఔట్ లో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి SUVలో కూర్చుని బీరు తాగారు. మందు మత్తు ఎక్కగానే తినమని తన వెంట తెచ్చిన ఫుడ్ ను యశస్విని భర్తకు తినిపించింది. అది తిన్న కాసేపటికి లోక్ నాథ్ మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత తన తల్లికి యశస్విని లొకేషన్ షేర్ చేసింది.
లోక్ నాథ్ మత్తులో ఉండగా యశస్విని తల్లి హేమ కత్తితో అల్లుడి గొంతులో రెండుసార్లు కసి తీరా పొడిచింది. దెబ్బకు మత్తు వదిలిన లోక్ నాథ్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. 150 మీటర్లు పరిగెత్తి.. ఆగి ఉన్న ఆటోలో దాక్కోవడానికి ప్రయత్నించాడు. అతని కేకలు, అరుపులు విన్న స్థానికులు అతని దగ్గరకు వెళ్లే లోపే తీవ్ర రక్త స్రావంతో లోక్ నాథ్ ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి నుంచి సైలెంట్ గా యశస్విని, అతని తల్లి తప్పించుకుని పారిపోయారు.