- సీఎంను ఒప్పించి చెన్నూరుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను తెచ్చిన: వివేక్
- సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్
కోల్‌బెల్ట్/ చెన్నూరు, వెలుగు: ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.250 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్య అందిస్తేనే భవిష్యత్‌లో పిల్లలు మంచి వ్యక్తులుగా తయారవుతారన్నారు. చెన్నూరులో యంగ్ ఇండియా స్కూల్ మొదట్లో లేదని, తాను సీఎం, డిప్యూటీ సీఎంని రిక్వెస్ట్ చేసి ఇక్కడ స్కూల్ సాధించినట్లు చెప్పారు. స్కూల్‌లో చదువుతో పాటు స్పోర్ట్స్, ఆడిటోరియం, టీచర్లకు వసతి వంటి సౌలత్‌లు ఉంటాయన్నారు. స్కూల్ ఏర్పాటుతో చుట్టు పక్కల ల్యాండ్ రేట్లు కూడా పెరుగుతాయని తెలిపారు. బిల్డింగ్ నిర్మాణం క్వాలిటీగా చేయాలని, లేకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. -మరోవైపు, చెన్నూరు శనిగకుంట మత్తడిని పేల్చివేత వెనుకున్న అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వివేక్ ఆదేశించారు. అవసరమైతే కలెక్టర్ జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఏడాదిలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలె: ఎంపీ వంశీకృష్ణ
సోమనపల్లి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ చాలెంజ్‌గా తీసుకొని ఏడాదిలోపు పూర్తి చేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. మొదటి లిస్టులో చెన్నూరుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదని, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎడ్యుకేషన్ సెక్రటరీని ఒప్పించి స్కూల్‌ను తీసుకొచ్చారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల కోసం కృషి చేశారని, విద్యకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. మా తాత కాకా వెంకటస్వామి కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బీఆర్ అంబేద్కర్ కాలేజీని స్థాపించారన్నారు. తమ కాలేజీలో చదివిన ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలు సాధించారని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా తమ కాలేజీలోనే చదివారని తెలిపారు. మరోవైపు, మందమర్రి మున్సిపాలిటీ బురదగూడెంలోని త్రిశక్తి అష్ట లక్ష్మి కామాఖ్య దశమహా విద్య దేవాలయంలో వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేశారు. కేకే5, కాసీపేట-1, ఇందారం1ఏ గనులపై ఉన్న దుర్గామాత ఆలయాల్లో కూడా వివేక్, వంశీకృష్ణ పూజలు చేశారు.