ఖాళీ శవపేటికలతో కుకీల ర్యాలీ .. మణిపూర్​లో వందలాది మంది పాదయాత్ర

ఖాళీ శవపేటికలతో కుకీల ర్యాలీ .. మణిపూర్​లో వందలాది మంది పాదయాత్ర

ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌‌లోని చురాచంద్‌‌పుర్‌‌ జిల్లాలో కుకీ వర్గానికి చెందిన పలు సంస్థలు ఖాళీ శవపేటికలతో కాలినడకన ర్యాలీ నిర్వహించాయి. ఇటీవల జిరిబాంలో సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో కుకీ వర్గానికి చెందిన 10 మంది యువకులు మృతి చెందారు. దీంతో వారికి సంఘీభావంగా కుకీ ప్రజలు నల్ల దుస్తులు ధరించి,10 ఖాళీ శవపేటికలు మోస్తూ ర్యాలీ నిర్వహించారు. జాయింట్ ఫిలాంత్రోపిక్ ఆర్గనైజేషన్ (జేపీవో) ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర జరిగింది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిపాలనే ఘర్షణలకు పరిష్కారమని పేర్కొంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన వారంతా తమ గ్రామ వాలంటీర్లని, వారు టెర్రరిస్టులు కాదని తెలిపారు. మృతుల పోస్టుమార్టం నివేదికలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు అంత్యక్రియలు  నిర్వహించబోమని స్పష్టం చేశారు. కుకీ అమరవీరుల స్మారక చిహ్నం 'వాల్ ఆఫ్ రిమెంబరెన్స్' వద్ద ర్యాలీని ముగించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షాను ఉద్దేశించి జిల్లా యంత్రాంగానికి వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 11న బోరోబెక్రా పోలీసు స్టేషన్‌‌తో పాటు సమీపంలోనే ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుపై కుకీ మిలిటెంట్లు ఆర్మీ దుస్తులు ధరించి దాడి చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు మృతిచెందారు. ఘటనాస్థలం  నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అప్పటి నుంచి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుకీ వర్గానికి చెందిన పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఎన్డీయే ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫైర్

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సీఎం బీరెన్ సింగ్ సోమవారం రాత్రి తన నివాసంలో ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఎన్డీయే కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మీటింగుకు హాజరుకాలేదు. సీఎం నిర్వహించిన మీటింగుకు ఎన్డీయే ఎమ్మెల్యేలు  అటెండ్ కాకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రంలో పరిస్థితి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియదా అని ప్రశ్నించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోడలపై ప్రజలు రాస్తున్న రాతలు ఆయనకు కనిపించడం లేదా అని నిలదీసింది.  జైరాం రమేశ్ మాట్లాడుతూ..మణిపూర్ ప్రజలు ఇంకెంతకాలం ఇలా భయంకరమైన వేదనతో బతకాలని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు రాష్ట్రానికి రావాలని ప్రధాని మోదీని కోరారు. ఘర్షణలకు బాధ్యత వహిస్తూ అమిత్  షా తన పదవికి రాజీనామా చేయాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

రాష్ట్రపతికి ఖర్గే లెటర్

మణిపూర్‌‌లో దిగజారుతున్న పరిస్థితులను వివరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే  లెటర్ రాశారు. మణిపూర్ ప్రజలు తమ ఇండ్లల్లో శాంతియుతంగా, గౌరవంగా  జీవించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమెను కోరారు.