గ్యాస్​ డెలివరీ వర్కర్స్​కు రూ.18 వేల జీతం ఇవ్వాలి : కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్

గ్యాస్​ డెలివరీ వర్కర్స్​కు రూ.18 వేల జీతం ఇవ్వాలి : కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్
  • కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ 5వ మహాసభలో వక్తల డిమాండ్​ 

ముషీరాబాద్, వెలుగు : గ్యాస్​ డెలివరీ వర్కర్స్​సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు విమర్శించారు. ఆదివారం బాగ్ లిగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 5వ మహాసభ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా చిరంజీవులుతో పాటు చెరుకు సుధాకర్, సోషల్ జస్టిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చామకూర రాజు, పార్టీ తెలంగాణ ఇన్​చార్జి కేవీ గౌడ్, బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్ హాజరయ్యారు.

చిరంజీవులు మాట్లాడుతూ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్లు బలహీనవర్గాల నుంచి వచ్చిన వారు అయినందు వల్లే ప్రభుత్వం కార్మికుల చట్టాలు అమలులో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల హక్కుల కోసం అడుక్కోవడం సిగ్గుచేటన్నారు. కేవీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు, రెండు జతల యూనిఫామ్ ఇచ్చి కార్మిక చట్టాలు, కనీస వేతన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రతి ఆటోలో ఫైర్​సేఫ్టీ మెషీన్​ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఆదివారం సెలవు ఇవ్వాలని కోరారు. డెలివరీ టైంలో కార్మికుడు మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్​గ్రేషియాతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుడు మంగిళి పల్లి శంకర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి బుర్ర చంద్రయ్య గౌడ్, ఉపాధ్యక్షులు ఎండీ యునుస్ పాల్గొన్నారు.