భారీగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర

భారీగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర
  • పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌‌కు రూ.2 పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ
  • పెట్రో భారం కంపెనీలే భరిస్తాయన్న కేంద్రం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ పొందిన పేదలకు కూడా ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలపై ఏటా రూ.400 కోట్ల వరకు భారం పడనుంది. రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్ల గ్యాస్​ కనెక్షన్లు ఉండగా, వారిలో తెల్లరేషన్ కార్డుదారుల కనెక్షన్లు 81 లక్షల దాకా ఉన్నాయి. ఇవి కాకుండా 8 లక్షల దాకా ఉజ్వల లబ్ధిదారులు ఉన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కే సిలిండర్ అందిస్తున్నది. ఉజ్వల స్కీమ్ కింద కేంద్రం ఒక్కో కనెక్షన్​పై రూ.200 చొప్పున సబ్సిడీ ఇస్తున్నది. 

ఈ పెంపుతో 14.2 కిలోల ఎల్‌‌పీజీ  సిలిండర్ ధర సాధారణ వినియోగదారులకు రూ.803 నుంచి రూ. 853కు పెరిగినట్లయింది. రాష్ట్రానికి వచ్చే సరికి రవాణా చార్జీలతో కలిపి ఒక్కో సిలిండర్ ధర రూ.905 కు చేరనుంది. కాగా, ఏటా ప్రతి కుటుంబం సగటున 6 సిలిండర్ల చొప్పున వినియోగిస్తారని భావించినా మహాలక్ష్మి వినియోగదారుల రూపంలో రాష్ట్ర సర్కారు  ఏటా సుమారు రూ.240 కోట్ల దాకా అదనంగా భరించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 49 లక్షల మంది లబ్ధిదారులపై ఏటా రూ.150 కోట్ల దాకా భారం పడనుంది.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

పెట్రోల్, డీజిల్‌‌పై లీటర్‌‌‌‌కు రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. అయితే పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ భారం వినియోగదారులపై పడదని.. కంపెనీలే చెల్లిస్తాయని కేంద్రం ప్రకటించింది. పెట్రోల్‌‌, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇవి ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వస్తాయి. తాజా పెంపుతో పెట్రోల్‌‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లీటర్‌‌కు రూ.11 నుంచి రూ.13కి, డీజిల్‌‌పై రూ.8 నుంచి రూ.10కి పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌‌పై విధించే మొత్తం పన్నులు లీటర్‌‌కు రూ.19.9 నుంచి రూ.21.9కి (రూ.1.40 బేసిక్ ఎక్సైజ్ సుంకం, రూ.13 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రూ.2.50 వ్యవసాయ సెస్, రూ.5 రోడ్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ సెస్‌‌) పెరిగాయి. డీజిల్‌‌పై మొత్తం పన్ను లీటర్‌‌కు రూ.15.80 నుంచి రూ. 17.80కి (రూ.1.80 బేసిక్ ఎక్సైజ్ సుంకం, రూ.10 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రూ.4 వ్యవసాయ సెస్, రూ.2 రోడ్ మరియు ఇన్‌‌ఫ్రా సెస్) పెరిగింది.