విశ్లేషణ: వంట నూనె మంట.. జనం జేబుకు చిల్లు

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పులు, ఉప్పుల నుంచి కూరగాయల వరకూ అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలైతే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అన్ని రకాల వంట నూనెలదీ ఇది దారి. మన దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. పండించే సామర్థ్యం ఉన్నా సరైన సపోర్ట్​ లేక అయిల్​ పంటల వైపు రైతులు మొగ్గుచూపడం లేదు. దీనికి తోడు కల్తీ నూనెలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వీటన్నింటి కారణంగా వంట నూనెలు మంటపెడుతుండటంతో సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి.

దేశంలో వంట నూనెల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నూనెల ధరలు తగ్గడానికి కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించినా ఆ ప్రభావం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం దిగుమతులపై మనం ఆధారపడటమే. మన దేశంలో వంట నూనెల డిమాండ్ 2.50 కోట్ల టన్నులుగా ఉంది. కానీ మన ఉత్పత్తి 1.05 కోట్లు మాత్రమే. దీంతో 60 శాతం పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దిగుమతుల్లో ప్రధానంగా 65-70 శాతం పామాయిల్, సోయా నూనెలు ఉన్నాయి. మలేషియా, ఇండోనేషియా నుండి సోయా, సన్​ఫ్లవర్ నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యాల నుంచి కూడా ఇతర నూనెలను దిగుమతులు చేసుకుంటున్నాం. 35 దేశాల నుంచి వంటనూనెల దిగుమతులు సాగుతున్నాయి. అదే సందర్భంలో మన దేశం నుంచి కొన్ని నూనెలు ఎగుమతి అవుతున్నాయి. 2015 మార్చిలో ఎగుమతులపై నిషేధం విధించినా.. 2017 మార్చిలో మళ్లీ ఎగుమతులకు అవకాశం కల్పించారు. వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, సోయా, మొక్కజొన్న గింజల నుంచి తీసిన నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ ఎగుమతి అవుతున్నాయి. మనదేశంలో 9 రకాల నూనె గింజలు ఉత్పత్తి చేస్తున్నా.. దేశీయంగా నూనెల ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.

సాగు విస్తీర్ణం పెరగలేదు
మనదేశంలో నూనె పంటల సాగు విస్తీర్ణం 6.67 కోట్ల ఎకరాలకు మించలేదు. 3.34 కోట్ల టన్నుల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ విత్తనాల నుంచి 1.05 కోట్ల టన్నుల నూనె తీస్తున్నారు. దిగుమతులపై రూ.70 వేల కోట్ల నుంచి రూ.1.80 లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాం. ఇన్ని కోట్లు దిగుమతుల కోసం ఖర్చు చేయడంకన్నా దేశంలో బీడుగా మారిన 9 కోట్ల ఎకరాల భూముల్లో నూనెగింజలు పండిచవచ్చు. ఇవి గతంలో నూనెగింజలు, పప్పుధాన్యాలు పండిన భూములే. నూనెగింజలను, పప్పుధాన్యాల ఉత్పత్తులను దెబ్బతీయడానికి వివిధ ప్రాంతాల్లో భూములను బీడు పెడుతున్నారు. దేశంలో 493 పెద్ద ఆయిల్, బ్లెండెడ్ మిల్లులు పనిచేస్తున్నాయి. వీటి స్థాయిని, సంఖ్యను కూడా పెంచాల్సి ఉంది. కానీ దేశీయ ఉత్పత్తిని పెంచకుండా దిగుమతులపై దృష్టి పెట్టడమే ధరల పెరుగుదలకు కారణం. ప్రధానంగా వేరుశెనగ, నువ్వులతో తయారైన నూనెలు అధిక ధరలు ఉండడం వలన ప్రజలు వినియోగానికి దూరమవుతున్నారు. అదే సందర్భంలో సోయా, పామాయిల్ ఉత్పత్తిని విస్తారంగా పెంచడానికి అవకాశాలున్నాయి. సోయా పంటలు వేసినచోట ఆయిల్ మిల్లులను స్థాపించకపోవడం వల్ల పంట కొనుగోలుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో సోయా విస్తీర్ణం పెరగడం లేదు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే..
వంటనూనెల దిగుమతులపై విధిస్తున్న సుంకం ధరలను ప్రతి ఏటా పెంచడం, తగ్గించడం చేస్తున్నారు. స్థిర విధానం అనేది లేకపోవడం వలన ధరల్లో స్థిరత్వం ఉండడం లేదు. 2020 జనవరిలో దిగుమతి సుంకాన్ని 37.5 శాతం నుంచి 45 శాతానికి పెంచారు. క్రూడ్ ఆయిల్ పైన దిగుమతి సుంకం 37.5 శాతం ఉండగా రిఫైన్డ్ ఆయిల్ పై 45 శాతానికి పెరిగింది. క్రూడ్ సోయా ఆయిల్ పై పెంచిన సుంకాన్ని రివైజ్ చేసి 27.5 శాతానికి తగ్గించారు. అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర టన్నుకు 900 అమెరికన్ డాలర్లుగా ఉంది. కానీ, 2020కి ముందు జరిగిన పరిణామాల ప్రభావం ఇప్పుడు గమనించాలి. 2018 జూన్ 14న దిగుమతి సుంకం క్రూడ్ పై 35 శాతం, రిఫైన్డ్ పై 45 శాతం ఉంది. ఆ తర్వాత 2020 జనవరి 8న క్రూడ్, రిఫైన్డ్ పైన 40 శాతం దిగుమతి సుంకం నిర్ణయించారు. దేశం నుంచి కొన్ని రకాల నూనెలు ఎగుమతి కావడం వలన, దేశీయ అవసరాలకు సరిపోవడం లేదని, 2008 మార్చిలో ఎగుమతులపై నిషేధం విధించారు. ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు. కొంతకాలం తర్వాత ఆవాల నూనె మినహా మిగిలిన అన్ని రకాల నూనెలను ఎగుమతి చేయవచ్చంటూ నోటిఫికేషన్ జారీచేశారు. 

63 శాతం దిగుమతులే
2020 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు 63 శాతం దిగుమతులు చేసుకున్నాం. దిగుమతి చేసుకున్న నూనెలను సాల్వెంట్ నూనెలు తయారుచేయడానికి కూడా వినియోగిస్తున్నాం. ప్రధానంగా పామాయిల్ దిగుమతులు విస్తారంగా పెంచుకుంటున్నాం. కానీ దేశంలో పామాయిల్ పంటలు పండించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దేశంలో 8 లక్షల ఎకరాల్లో మాత్రమే పామాయిల్ తోటలు ఉన్నాయి. కనీసం 40 లక్షల ఎకరాల్లో పామాయిల్​ తోటలు ఉండాలి. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో 14 వేల ఎకరాల పామాయిల్​ తోటలు తీసేశారు. 4 సంవత్సరాలుగా 90 శాతం సబ్సిడీపై పామాయిల్ పంటలు రైతులతో వేయిస్తామని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదు. 40 వేల ఎకరాల పామాయిల్ తోటలున్న తెలంగాణలో మరో 5 వేల ఎకరాల్లో వేస్తామని చెప్పి 1,162 ఎకరాల్లో మాత్రమే వేశారు. సోయా, ఆయిల్‌‌పామ్ తోటలు వేయడంలో జరిగిన జాప్యం వల్ల నూనె దిగుమతులు తప్పనిసరయ్యాయి. అంతర్జాతీయంగా నూనె ఎగుమతుల లాబీ కూడా ఇండియాలో దేశీయంగా నూనెల ఉత్పత్తులు పెరగకుండా దిగుమతులపై ఆధారపడేలా ఉంది. మన దేశీయ ఉత్పత్తి ధరలకన్నా తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. మన దేశానికి ఎగుమతి చేసే వ్యాపారులకు ఆయా దేశాలు ఎగుమతి సబ్సిడీ ఇస్తున్నాయి. కానీ మన లోటును పూడ్చుకోవడానికి మాత్రం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడంలేదు. 1995 నుంచి 2000 వరకు స్వయం పోషకత్వం కలిగిన ఇండియా నేడు ఎగుమతులను తగ్గించి దిగుమతులపై ఆధారపడుతున్నది. 

వినియోగం తక్కువ.. దిగుమతులు ఎక్కువ
వంట నూనెలకు సంబంధించి మన దగ్గర వినియోగం పెరగడం లేదు. తలసరి వినియోగం సంవత్సరానికి 10 కిలోల నుంచి 19.5 కిలోలకు మాత్రమే పెంచుకోగలిగాం. వాస్తవానికి చాలా దేశాల్లో 35 కిలోల వరకు వివిధ రూపాల్లో నూనెల వాడకం ఉన్నది. దేశీయంగా చిల్లర వ్యాపారులు తమ లాభాలు పెంచుకోడానికి ప్రభుత్వం ప్రకటించే ఎగుమతి, దిగుమతులను సాకుగా చూపుతున్నారు. గత నెల కేంద్రప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం తగ్గించినప్పటికీ చిల్లర వ్యాపారులు మాత్రం ట్రాన్స్​పోర్ట్​ ఖర్చు పెరిగిందన్న పేరుతో ఏమాత్రం ధర తగ్గించలేదు. గతంలో కిలో నూనె ధర రూ.60 నుంచి 80 ఉండగా నేడు రూ.120 నుంచి 150 వరకు పెరిగిపోయింది. మరోవైపు వంటలకు కాకుండా ఇతర అవసరాలకు వాడే నూనెల దిగుమతులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. 3.50 లక్షల టన్నుల నుంచి 4 లక్షల టన్నులకు పెరిగాయి. ఇవి కూడా నాణ్యత లేనివి, దేశీయంగా ఉత్పత్తి అవుతున్నవే. కనీసం వీటిని కూడా స్వయం పోషకత్వం చేసుకోలేకపోతున్నాం. ఇండోనేషియా, మలేషియా, కొలంబియాతో పాటు మరో 35 దేశాల నుంచి దిగుమతులు సాగుతున్నాయి.

కల్తీ నూనెలతో కష్టాలు
ఇక బ్రాండెడ్ నూనెలను పెద్దఎత్తున కల్తీ చేస్తున్నారు. పశువుల కొవ్వు, ఇతర రసాయనాలు కలిపి నూనెలు తయారు చేస్తుండగా మరోవైపు వైట్ ఆయిల్ తయారు చేసి వంట నూనెల్లో కలుపుతున్నారు. కొన్నిరకాల దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్లు, చిప్స్ తయారుచేసే కంపెనీలకు వీటిని సరఫరా చేస్తున్నారు. కాదేదీ కల్తీకి అనర్హం అన్న రీతిలో నూనెలే కాక కారం, పసుపు, మసాలాలు, సబ్బులు, ఇతర అన్ని సరుకులనూ కల్తీ చేస్తున్నారు. వ్యాపారులతో కుమ్ముక్కైన కొందరు విజిలెన్స్ అధికారులు విషయం తెలిసినా కలీలను నిరోధించలేకపోతున్నారు. ఈ కల్తీ నూనెలు వాడి అనేక మంది అనారోగ్యానికి గురై మరణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇతర దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి
దేశంలో ఉన్న సాగుభూమిలో సోయా, ఆయిల్‌‌పామ్ తోటలు వేస్తే మూడేండ్లలో మన లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కనీసం 20 భారీ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి నూనె గింజల నుంచి నూనె తీయాలి. నూనె పంటల్లో వచ్చే ఉప ఉత్పత్తులన్నీ వినియోగానికి వచ్చేవే. అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా నూనెగింజల నుంచి నూనె తయారీకి తమ బడ్జెట్​లో అధిక భాగాన్ని వెచ్చిస్తున్నాయి. కనీసం బ్రెజిల్‌‌ను ఉదాహరణగా తీసుకుని అక్కడి విధానాన్ని అధ్యయనం చేసి, దానిని ఇక్కడ అమలు చేయాలి. రానురాను నూనెల దిగుమతుల భారం భరించలేనిదిగా మారడంతో 60 శాతం మంది పేదలు నూనెల వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఈ ప్రమాదం మరింత పెరగకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూములను బీడుగా పెట్టకుండా నూనెగింజల ఉత్పత్తికి కేటాయించాలి. రాష్ట్రాల్లో కూడా ప్రాసెసింగ్ యూనిట్లను, పంపిణీ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలి. చౌక డిపోల ద్వారా మనిషికి నెలకు ఒక కిలో మంచినూనె సబ్సిడీ ధరకు ఇవ్వాలి. లాభాల దృష్ట్యా నూనె దిగుబడి వస్తున్న గింజలను ఇతర ఉప ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు. దేశీయ అవసరాలకు సరిపడా నూనెలు తీసిన తర్వాత మాత్రమే ఉప ఉత్పత్తులకు కేటాయించేలా విధానాలు రూపొందించాలి. ఎగుమతి, దిగుమతుల్లో ప్రయోగాలు చేయకుండా స్థిర సుంకాలు నిర్ణయించాలి. దేశంలో కొరత ఉన్నప్పుడు ఎగుమతులను నియంత్రించి, మిగులు ఉన్నప్పుడు మాత్రమే అవకాశం కల్పించాలి. అప్పుడే వంట నూనెల ధరలు కాస్తయినా అదుపులో ఉంటాయి.