దమ్మపేట, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం పొదలమ్మ ఆలయం వద్ద శుక్రవారం వంట నూనె ట్యాంకర్ బోల్తా పడడంతో జనం బకెట్లు, బిందెలతో నూనె కోసం ఎగబడ్డారు. అశ్వారావుపేట వైపు నుంచి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న ఆయిల్ట్యాంకర్ మొద్దులగూడెం పోతులమ్మ ఆలయం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి నూనె లీక్అవుతుండడంతో గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న బకెట్లు, బిందెలు తీసుకొని ట్యాంకర్ వద్దకు పరుగులు తీశారు.
వీలైనంత వరకు వాటిల్లో నింపుకోవడానికి ఎగబడడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కొద్దిసేపట్లోనే ట్యాంకర్ మొత్తం ఖాళీ చేశారు. ఈ సందర్భంగా రోడ్డుకు రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అందరినీ పంపించేశారు. కాకినాడ నుంచి హైదరాబాద్ ఫ్యాక్టరీకి ఆయిల్ తీసుకెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.