
- అదే పద్ధతిని గ్రేటర్లో ఫాలో కావాలని జీహెచ్ఎంసీ యోచన
- పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా కూకట్ పల్లిలో అమలు
- సక్సెస్ అయితే సిటీ అంతా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ సిటీలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దోమలను నివారించడం సాధ్యం కావడం లేదు. దీంతో రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్సమీపంలోని కన్హా శాంతి వనం పద్ధతిని ఫాలో కావాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. కన్హాలో పెట్రో ఉత్పత్తులతో ఫాగింగ్చేయకుండా కొన్ని కెమికల్స్ఉపయోగించి కూల్ ఫాగింగ్ చేస్తూ దోమలను నియంత్రిస్తున్నారు. ఈ పద్ధతిలో చక్కటి ఫలితాలు వస్తుండడంతో బల్దియా కమిషనర్ ఇలంబరితి అక్కడికి వెళ్లి పరిశీలించాలని హెల్త్ విభాగం అధికారులను ఆదేశించారు.
కన్హాలో ఏం చేస్తున్నారంటే..
కన్హాలో ఆక్వా కె-ఓథ్రిన్ కెమికల్‌ను ఉపయోగిస్తున్నారు. అక్కడ మొత్తం 400 ఎకరాలు ఉండగా, 31 టీమ్స్ఏర్పాటు చేసి ఒక్కో టీమ్‌లో ఇద్దరిని ఈ పనికి ఉపయోగిస్తున్నారు. వీరంతా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి దొడ్డు ఉప్పు వేసి లార్వాకి చెక్ పెడుతూ దోమలు పుట్టే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండే చోట దొడ్డు ఉప్పు వేయడంతో అక్కడ లార్వా ఏర్పడకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు వినియోగించని టాయిలెట్లలో కూడా ఇదే పద్ధతిలో దొడ్డు ఉప్పు వేయడంతో దోమలు పుట్టడం లేదు. శాంతివనంలో రోజూ సుమారు 5 వేల మంది వరకు ఉంటారు. అయినా ఇప్పటివరకు ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదు. అంతేగాకుండా మోటెల్ ట్రాప్ పద్ధతి ద్వారా దోమలను సేకరించి అవి ఎటువంటివని పరీక్షిస్తున్నారు.
తగ్గనున్న ఖర్చు
గ్రేటర్ లో ఏండ్లుగా దోమల నివారణకు ఫాగింగ్ మాత్రమే చేస్తున్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఇతర మార్గాలు లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. దీనికి డీజిల్ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రతిఏడాది దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. కన్హా శాంతివనంలోని కోల్డ్ఫాగింగ్పద్ధతిని ఫాలో అయితే కేవలం నీరు, దొడ్డు ఉప్పు, కొన్ని రసాయనాలు మాత్రమే సరిపోతాయి. కొత్త పద్ధతి కోసం కొన్ని మెషీన్లు కొంటే చాలు.
ఒక సర్కిల్లో పైలట్ ప్రాజెక్ట్
జీహెచ్ఎంసీ అధికారులు కూకట్ పల్లిలోని ఒక సర్కిల్ లో పైలట్ ప్రాజెక్టు కింద కోల్డ్ ఫాగింగ్ చేయనున్నారు. వారం ముందు అక్కడ దోమలు ఎలా ఉన్నాయి? ఫాగింగ్ చేసిన వారం తర్వాత దోమలు తగ్గాయా? లేదా అన్నది పరిశీలిస్తారు. దీనికి ఐసీఐఆర్– ఐఐసీటీతో పాటు థర్డ్ పార్టీ సేవలను ఉపయోగించుకోనున్నారు. నిజంగా దోమల నివారణ జరిగిందని భావిస్తే వచ్చేనెల నుంచి గ్రేటర్ అంతటా ఇంప్లిమెంట్చేయాలని చూస్తున్నారు.