నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతోంది. పెరుగుతున్న చలితో జనం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న స్టూడెంట్లు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు కలిపి సుమారు 350 వరకు ఉన్నాయి. ఇందులో 6వ నుంచి 10వ తరగతి వరకు సుమారు 24 వేల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరికి చలికాలంలో వేడి నీళ్ల కోసం గీజర్లు ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇది అమలు అవుతుతున్నట్లు కనిపించడం లేదు. కొన్ని హాస్టళ్లలో గీజర్లు ఉన్నా పనిచేయడం లేదు. దీంతో పిల్లలు చన్నీళ్లతోనే స్నానాలు చేస్తూ గజగజ వణుకుతున్నారు. మరోవైపు స్టూడెంట్లకు దుప్పట్లు కూడా సరిగా లేవని తెలుస్తోంది.
పది రోజులుగా తగ్గిన కనిష్టం..
ఉమ్మడి జిల్లాలో 10 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. ఈనెల 15 వ తేదీన 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, 17న అది కాస్తా 9.5 డిగ్రీలకు పడిపోయింది. తాజాగా ఆదివారం 16 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. చల్లగాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం పూట పొగమంచు వీడడం లేదు. మారిన వాతావరణంతో చాలా మంది స్టూడెంట్లు జలుబు, జ్వరాలతో అవస్థలు పడుతున్నారు.
జ్వరాలు వస్తున్నాయి.
ఐదు రోజుల నుంచి చలి బాగా పెరిగింది. హాస్టల్‌లో గీజర్లు లేక చల్ల నీళ్లతో తానాలు చేస్తున్నం. దీంతో జలుబు, జరాలు వస్తున్నాయి. చలి కాలం పూర్తయ్యే వరకు వేడి నీళ్లు ఇస్తే బాగుండు. - పీర్ సింగ్, 8వ తరగతి, ఎస్టీ హాస్టల్ న్యాల్‌కల్ రోడ్
చద్దర్లు ఇయ్యలేదు..
హాస్టల్ బిల్డింగ్‌లో కొన్ని కిటికీలు, డోర్లు బాగాలేవు. దీంతో రాత్రి పూట చలి బాగా ఉంటుంది. చద్దర్లు కూడా ఇవ్వలేదు. మాములు బెడ్ షీట్లతో చలిని తట్టుకోలేకపోతున్నాం.
- రాజు, 6వ తరగతి, ఇంటిగ్రేటేడ్ హాస్టల్ న్యాల్‌కల్ రోడ్