
నిష్పక్షపాతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని సూర్యాపేట జిల్లాకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్‌రావు కోరారు. చిల్లకల్లులో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ పోలీస్, అధికారులతో నవంబర్ 3న సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకట్ రావు.. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నామని, ఇప్పటికే తనిఖీలు కట్టుదిట్టం చేశామన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తమ సిబ్బందిని ఉంచి వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని ఎన్టీఆర్ జిల్లా అధికారులను ఆయన కోరారు. తమ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే జిల్లా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
ALSO READ : మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పొరుగు జిల్లాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందజేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డి డిల్లీరావు హామీ ఇచ్చారు. తమ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువుల రవాణా జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు ఈ విషయంలో సమన్వయంతో పని చేస్తామని, మక్త్యాల్, రామాపురం రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా, తనిఖీలు ముమ్మరం చేస్తామని హామీ ఇచ్చారు.