![ఆర్డరిచ్చి..అమలు చేయలె .. విద్యుత్ డిస్కమ్ ల్లోని 19,587 మంది ఆర్టిజన్లు ఏండ్లుగా పోరాటం](https://static.v6velugu.com/uploads/2025/02/copies-of-order-were-provided-stating-that-artisans-were-being-merged-into-power-company-in-july-2017_WhdnocIuil.jpg)
- గత సర్కార్ లో విద్యుత్ సంస్థల్లో విలీనానికి ఆర్డర్ కాపీలు అందజేత
- అసెంబ్లీలోనూ ప్రస్తావించిన మాజీ సీఎం కేసీఆర్
- అయినా.. అమలు చేయకుండా నిర్లక్ష్యం
- తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఆర్టిజన్ల పోరాటం
- ఈ నెల 20న చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి నిర్ణయం
మెదక్/నిజాంపేట, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో 2017 జూలైలో ఆర్టిజన్లను విద్యుత్ సంస్థలో విలీనం చేస్తున్నామని ఆర్డర్ కాపీలను అందించారు. దీనిపై అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లను విలీనం చేశామని గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు. అయినా.. అమలు చేయడంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆర్టిజన్లు గత ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏండ్లుగా పోరాడుతున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని, దిగిపోయిన తెల్లారి నుంచే అడ్డా కూలీగా మారాల్సిన దుస్థితి నెలకొందని, తమ సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్జిజన్లు యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలను అందించారు. స్పందన లేకపోవడంతో గత నెలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఐదు రోజుల పాటు సమ్మె చేశారు. ఈనెల11న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. 20న చలో విద్యుత్ సౌధ కార్యక్రమం చేపట్టాలని కూడా నిర్ణయించారు.
నలుగురు చేసే పని ఇద్దరు చేస్తున్నా..
రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యుత్ డిస్కమ్ ల్లో 19,587 మంది ఆర్టిజన్లు పని చేస్తున్నారు. సంస్థ రూల్స్ మేరకు ఒక్కో సబ్ స్టేషన్లో నలుగురు ఆర్టిజన్లు, ఒక నైట్ వాచ్ మెన్ ఉండాలి. కానీ చాలా సబ్ స్టేషన్లలో జూనియర్ లైన్మెన్(జేఎల్ఎమ్) తో పాటు మరొక ఆపరేటర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు చేసే పనిని ఇద్దరు, ముగ్గురు చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆర్టిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే సంస్థలో, ఒకే విధమైన పని చేస్తున్నప్పటికీ రెగ్యులర్ సిబ్బందికి ఒక రూల్, ఆర్టిజన్లకు మరో రూల్ ఉన్నాయని చెబుతున్నారు. ఒక సంస్థలో రెండు రకాల సర్వీస్ రూల్స్ ఉండడం సరికాదని, దీనిని వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్సబ్ స్టేషన్లు పెరుగుతున్నప్పటికీ అందుకనుగుణంగా ఉద్యోగుల సంఖ్య పెంచడం లేదంటున్నారు. విద్యార్హతను బట్టి అర్హులను జేఎల్ఎంగా కన్వర్షన్ చేయాలని ఆర్టిజన్లు
కోరుతున్నారు.
డ్యూటీలో రెండు చేతులు కోల్పోయిన..
నిజాంపేట మండలం నస్కల్ సబ్ స్టేషన్ లో డ్యూటీ చేస్తూ .. నా రెండు చేతులు కోల్పోయా. సంస్థ నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నా. ఏ ఆఫీసర్ దగ్గరకు వెళ్లినా ఎలాంటి స్పందన లేదు. సర్కార్ వెంటనే మమ్మల్ని కన్వర్షన్ చేయాలి.- రవి, పోల్ టూ పోల్ ఆర్టిజన్
మమ్మల్ని పర్మనెంట్ చేయండి
ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద మమ్మల్ని రెగ్యులర్ చేయొచ్చని 2018 లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సర్వీస్ రూల్స్ ప్రకారం విద్యార్హతలను బట్టి రెగ్యులర్ పోస్ట్ లోకి కన్వర్షన్ చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మమ్మల్ని వెంటనే చర్చలకు పిలవాలి. చలో విద్యుత్ సౌధ కార్యక్రమంతోనైనా సమస్య పరిష్కారం లభించకపోతే.. సమ్మెకు వెళ్తాం. - సదానందం, ఆర్టిజన్ల రాష్ట్ర ఫైనాన్షియల్ సెక్రటరీ
ఆర్డర్ అమలు చేయాలి
2017లో ఇచ్చిన ఆర్డర్ కాపీని యథావిధిగా కొనసాగించాలి. గ్రేడ్ ప్రమోషన్ల ద్వారా గవర్నమెంట్ కు రూ.54 వేల కోట్ల ఆర్థిక భారం పడుతుంది. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ చూపిన ప్రకారం కన్వర్షన్ ఇస్తే ఎలాంటి ఆర్థిక భారం పడదు. ఏడేళ్ల బోనస్ తో పాటు ఏరియర్స్, ఇంక్రిమెంట్లు వదులుకుంటాం. ఆర్టిజన్ రూల్స్ రద్దు చేసి ప్రస్తుతం ఉన్న రూల్స్ ను వర్తింపజేయాలి.
తిరుపతి, రాష్ట్ర కో కన్వీనర్