
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల చారిత్రక వైభవానికి, ఉద్యమాలకు, అణచివేతలకు రాగి రేకులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. వాటి మీద చెక్కిన విషయాల ఆధారంగానే బయటి ప్రపంచానికి అప్పటి విషయాలు తెలిశాయి. అయితే, ఇవి చరిత్రనే కాదు.. అప్పట్లో దాచిన నిధుల దారులను కూడా దాచుకున్నాయి. అలాంటి రాగి రేకులే డెడ్ సీ ఒడ్డున ఉన్న కుమ్రాన్ గుహల్లో దొరికాయి. కానీ.. వాటిలో చెప్పిన ప్రాంతాల్లో ఇప్పటివరకు నిధులలాంటివేవీ దొరకలేదు.
మన దేశంలో చరిత్రను, జ్ఞానాన్ని ముందు తరాలకు అందించేందుకు రాగి రేకులు ఎంతగానే సాయపడ్డాయి. అంతెందుకు కొందరు జమీందారులు వాళ్ల ఆస్తుల వివరాలను కూడా రాగి రేకుల మీదే రాసుకునేవాళ్లు. వాటి ఆధారంగానే వాళ్ల వారసులు ఆస్తులను పంచుకునేవాళ్లు. అయితే.. ఇజ్రాయిల్, జోర్డాన్ దేశాల మధ్య ఉన్న డెడ్ సీ ఒడ్డున దొరికిన ఈ రాగి రేకులు నిధుల వివరాలను చెప్తున్నాయని చాలామంది నమ్ముతున్నారు.
బెడౌయిన్‌కు చెందిన కొందరు యువకులు డెడ్ సీ(మృత సముద్రం)ని ఆనుకుని ఉన్న కొండల్లోకి మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్లేవాళ్లు. 1946 చివరిలో లేదా1947 మొదట్లో ఒకరోజు వాళ్లు ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తున్న డెడ్ సీ వాయువ్య ఒడ్డున ఉన్న ‘కుమ్రాన్’ ప్రాంతానికి దగ్గర్లో గొర్రెలు, మేకల్ని మేపుతున్నారు. వాళ్లలో ఒక గొర్రెల కాపరి కొండ పక్కన ఉన్న గుహలోకి రాయి విసిరాడు. అంతే లోపలి నుంచి ఏదో పగిలిపోయిన సౌండ్ వచ్చింది. దాంతో వాళ్లంతా కలిసి గుహలోకి వెళ్లారు. అక్కడ పెద్ద మట్టి పాత్రలు కనిపించాయి. వాటిలో ఏడింటిలో తోలు, పాపిరస్ స్క్రోల్స్ ఉన్నాయి. విషయం తెలుసుకున్న పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపడం, వాటిపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు.11 గుహల్లో కలిపి దాదాపు 800 పురాతన మాన్యుస్క్రిప్ట్స్ దొరికాయి. వాటిని సేకరించేందుకు దాదాపు ఐదేండ్లు పట్టింది. అయితే.. అక్కడ దొరికిన మాన్యుస్క్రిప్ట్స్ అన్నీ చుట్టచుట్టి ఉన్నాయి. అందుకే వాటిని ‘‘డెడ్ సీ స్క్రోల్స్’’గా పిలుస్తారు.
యూదుల మాన్యుస్క్రిప్ట్స్
ఇక్కడ దొరికిన మాన్యుస్క్రిప్ట్స్ చాలా వరకు హిబ్రూ భాషలో ఉన్నాయి. వాటి మీద పరిశోధనలు చేసిన చాలామంది సైంటిస్ట్‌లు అవి యూదులకు సంబంధించినవే అని చెప్పారు.1952లో మూడవ గుహలో వెతుకుతున్న పురావస్తు శాస్త్రవేత్తలకు రెండు లోహపు చుట్టలు ప్రత్యేకంగా కనిపించాయి. అవి రాగితో చేసిన స్క్రోల్స్. వాస్తవానికి ఆ రాగి స్క్రోల్స్‌లో మూడు సన్నని మెటల్ షీట్‌లు ఉన్నాయి. అవి పొడవైన స్ట్రిప్‌లా ఏర్పడ్డాయి. అయితే.. అప్పట్లో ఒక భాగం విరిగిపోవడంతో రెండు భాగాలు మాత్రమే స్క్రోల్ చేసి దాచారు.
అయితే.. ఈ చుట్టలను విప్పడం, అందులోని స్క్రిప్ట్‌ని చదవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే.. ఆక్సీకరణ వల్ల రాగి బిరుసుగా మారిపోయింది. చుట్ట విప్పాలంటే.. ఎక్కడికక్కడ విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే కొన్నాళ్లు ట్రై చేసిన తర్వాత...1956లో ఆ స్క్రోల్స్‌ను మాంచెస్టర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి పంపించారు. అక్కడ వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించారు. అలా 23 స్థూపాకార భాగాలు ఏర్పడ్డాయి. వాటిని అమ్మన్‌లోని జోర్డాన్ మ్యూజియంలో ఉంచారు.
నిధికి దారి చూపుతుందా?
కుమ్రాన్‌లో దొరికిన ఈ కాపర్ స్క్రోల్ ఆసక్తికరంగా ఉంది. అందులో డజన్ల కొద్దీ బంగారు, వెండి నిధుల గురించి రాసి ఉందని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే.. మిగతా స్క్రిప్ట్స్ జంతు చర్మాలపై సిరాతో రాశారు. కానీ.. ఇది మాత్రం ప్రత్యేకంగా రాగిపై రాశారు. అంటే ఇందులో ఏదో ముఖ్యమైన విషయం ఉంది. కాబట్టే ఇలా రాసి ఉంటారు అనుకున్నారంతా. రాగి పలకలపై హిబ్రూ, గ్రీకు అక్షరాలు చెక్కారు. అందులో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న 64 అండర్‌గ్రౌండ్ ప్రదేశాల గురించి ఉంది. అయితే.. ఆ ప్రాంతాల్లో సంపద ఉందని చాలామంది నమ్మారు. ఎంతోమంది దాని కోసం ప్రయత్నాలు కూడా చేశారు. కానీ.. ఎక్కడా ఏమీ దొరకలేదు.
అనేక ప్రాంతాలు
మాన్యుస్క్రిప్ట్స్‌లోని ఒక్కో భాగం ఒక్కో ప్రాంతం గురించి చెప్తుంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో దాచిన విలువైన వస్తువుల గురించి అందులో రాసి ఉంది. మొదటి నాలుగు నిలువు వరుసల్లోని కొన్ని విభాగాల చివరిలో విచిత్రమైన కోడ్ ఉంది. పైగా విషయం అంతా హిబ్రూ భాషలో రాశారు. ముగింపులో ఉన్న కోడ్‌లు మాత్రం గ్రీకు అక్షరాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఆ కోడ్‌లకు ఎవరూ సరైన వివరణ ఇవ్వలేకపోయారు. కొందరు వాటిని వ్యక్తుల పేర్లకు అబ్రివేషన్లు అని చెప్తున్నారు. కానీ.. ఆ వ్యక్తులు ఎవరు? అందులో వాళ్ల పేర్లు ఎందుకు రాశారు? వాళ్లకు ఈ నిధులతో సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడం లేదు.
మీరు అంటే ఎవరు?
కాపర్ స్క్రోల్‌లోని టెక్స్ట్‌లో ఎక్కువ సార్లు ‘‘మీరు” అని మొదలవుతుంది. ఉదాహరణకు ‘‘మీరు ఆ రెండు స్థానాల మధ్య దూరాన్ని కొలవండి” అని ఉంటుంది. అంటే.. ఆ స్క్రోల్స్ ఎవరినో ఉద్దేశించి రాసినవని అర్థం అవుతుంది. కానీ.. అదెవరు? అనేది మాత్రం తెలియదు. అంతేకాదు.. కొన్ని ప్రదేశాల గురించి చెప్పినప్పుడు ప్రత్యేకంగా కొలతలతో సహా చెప్పారు. ఒక చోట “మూడు మూరలు తవ్వండి” అని ఉంది. దీన్ని బట్టి చూస్తే.. స్క్రిప్ట్‌లో ఎక్కువగా దాచిన నిధులను తిరిగి పొందడం గురించి రాసినట్టే అనిపిస్తుంది.
ఎక్కువగా జెరూసలేంలో...
ఈ స్క్రిప్ట్‌లో చెప్పిన చాలా ప్రాంతాలు భౌగోళికంగా జెరూసలేంలో లేదా దానికి దగ్గర్లోనే ఉన్నాయి. మిగతావి కుమ్రాన్ , జెరిఖో చుట్టూ ఉన్నాయి. అయితే.. కొన్ని మాత్రం ఉత్తర పాలస్తీనాలో ఉన్నాయి. ఈ ప్రదేశాలు చాలావరకు హిబ్రూ బైబిల్‌లో కూడా ఉన్నాయి. అందులో చెప్పిన ప్రదేశాల్లో కోహ్లిట్ తప్ప చాలా ప్రదేశాలు శిథిలాలు, నిర్జన భవనాలు, సమాధులు, భూగర్భ గుహలుగా గుర్తించారు.
ఎందుకు?
రాగి స్క్రోల్స్ దొరికినప్పటి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఈ రహస్యమైన కళాఖండం కోసం ఎందుకు అంత ఖర్చు చేశారు? చరిత్రలో ఏదో ఒక టైంలో ఇందులో చెప్పిన సంపదలు ఉండేవా? అసలు ఈ స్క్రోల్స్‌ని ఎవరు చేయించారు? ఎవరి కోసం చేయించారు? అనేవి మనముందున్న ప్రశ్నలు. అప్పట్లో రాగి చాలా ఖరీదైనది. కాబట్టి వీటిని తయారుచేసేందుకు చాలా ఖర్చు అవుతుంది. మరి అంత ఖర్చు చేసి వీటిని తయారు చేయించడం దేనికి? ఈ విషయాన్ని మరో విధంగా కూడా తర్వాత తరాలకు అందించొచ్చు.
అయితే... పురాతనకాలంలో బహుశా కుమ్రాన్‌లో ఒక యూదు సంఘం ఉండేదని ఫిలో, జోసెఫ్‌లు చెప్పారు.
ఈ సంఘం చాలా సంపదను కూడబెట్టుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే.. సంఘంలోకి వచ్చేటప్పుడు సభ్యులు వాళ్ల ఆస్తి మొత్తాన్ని సంఘానికి అప్పగించాలనే నియమం ఉండేదని కొందరు చెప్పారు. అందుకే సంఘం దగ్గర చాలా డబ్బు ఉండేదని, ఆ సొమ్మునే ఇలా దాచుకున్నారని అంటారు. రోమన్లకు వ్యతిరేకంగా క్రీస్తు శకం 66–74 సంవత్సరాల మధ్య మొదటి యూదుల తిరుగుబాటు జరిగింది. ఈ టైంలో సంఘం సభ్యులు లేదా కొందరు వ్యక్తులు తమ ఆస్తులను ఇలా దాచిపెట్టుకుని ఉండొచ్చనే మరో వాదన కూడా వినిపిస్తోంది. మరి కొందరేమో రాగి స్క్రోల్స్‌లో చెప్పిన విలువైన వస్తువులు జెరూసలేంలోని ఆలయ సంపదను సూచిస్తాయని చెప్తున్నారు. రాగి స్క్రోల్స్ సంపద ఒక సాహిత్య కల్పన అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు.
హిబ్రూ బైబిల్
‘ఎస్తేర్’ పార్ట్ మినహా పాత నిబంధనలోని దాదాపు అన్ని విషయాలు ఇక్కడ దొరికిన శకలాల్లో ఉన్నాయి. యూదు రాణి పెర్సియా కథను వివరించే భాగం కాలక్రమేణా విచ్ఛిన్నమైందని లేదా ఇంకా వెలికితీయలేదని కొందరు అంటున్నారు. ఈ మాన్యుస్క్రిప్ట్స్‌లో హిబ్రూ బైబిల్‌తో పాటు మరెన్నో విషయాలు ఉన్నట్టు చెప్తున్నారు.