మిర్యాలగూడ, వెలుగు : రైతులు పంట పొలాలు, కెనాల్స్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్లను సుత్తి, రెంచీలు , కటింగ్ ప్లేయర్‌లతో ధ్వంసం చేసి .. కాపర్(రాగి)వైర్‌ను ఎత్తుకెళ్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ టూటౌన్ పీఎస్ లో డీఎస్పీ వెంకటగిరి కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన కుంచం కోటేశ్, రూపాని గోపి, కూపాని నాగయ్య, వరికుప్పల శ్రీనివాస్, ఒరుసు నాగరాజు, కుంచం విజయ్ వ్యవసాయ కూలీలు పని చేస్తున్నారు.
డబ్బులు సరిపోకపోవడంతో కొన్నాళ్ల కింద ముఠాగా ఏర్పడి ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైర్‌ను దొంగిలించి అమ్మడం మొదలు పెట్టారు. ఇలా గొంగిలించిన కాపర్ అమ్మేందుకు మంగళవారం బైకులపై టైన్‌కు వస్తుండగా.. స్థానిక హనుమాన్ పేట వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వీరిపై మిర్యాలగూడ, వేములపల్లి, నేలకొండపల్లి
త్రిపురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు ట్రాన్స్ ఫార్మర్ల కాపర్ వైర్ చోరీ కేసులు నమోదైనట్లు డీఎస్పీ చెప్పారు. వీరి నుంచి 305 కేజీల కాపర్ వైరు, డీలక్స్, ప్యాషన్, గ్రామర్ బైక్‌లు, ఒక స్మార్ట్ ఫోన్, రెండు కీ ప్యాడ్ ఫోన్ల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు వెల్లడించారు.