తీగ లాగితే : కేరళ కిడ్నీ రాకెట్ వెనక హైదరాబాద్ లింక్స్.. కిడ్నీకి లక్షల్లో బేరాలు

తీగ లాగితే : కేరళ కిడ్నీ రాకెట్ వెనక హైదరాబాద్ లింక్స్.. కిడ్నీకి లక్షల్లో బేరాలు

కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారిన కిడ్నీ అమ్మకాల బాగోతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. డబ్బు ఆశచూపి పేదలను టార్గెట్ చేస్తున్న ముఠా వెలుగులోకి వచ్చింది. కొచ్చీలో ఓ వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్ తో తీగ లాగిన కేరళ పోలీసులు.. హైదరాబాద్ లో డొంక కదిలింది. కేరళ, హైదరాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు కిడ్నీ రాకెట్ చేసినట్లు తేలింది. లక్షల రూపాయల ఆశ చూపి కిడ్నీలను కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారిని ఇరాన్ దేశం తీసుకెళ్లి.. అక్కడ కిడ్నీలను తీసుకుంటున్నారు. 20 లక్షల రూపాయల ఒప్పందంలో భాగంగా.. కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వటంతో.. ఆ కుటుంబం ఇచ్చిన కంప్లయింట్ తో ఇప్పుడు ఈ కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ కేంద్రంగానే

హైదరాబాద్ కేంద్రంగానే ఈ  అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ అంతా నడిచింది. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం కూడా ఉందని కేరళ పోలీసులు గుర్తించారు.  ఈ కేసును చేధించడానికి  ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా ఆధ్వర్యంలోని సిట్‌ బృందం హైదరాబాద్‌ చేరుకుంది.  

రూ. 20లక్షలు అని చెప్పి ఆరు లక్షలే 

పేద యువకులనే టార్గెట్ చేసుకోని ఈ ముఠా  కిడ్నీ రాకెట్ దందా నడిపిస్తుంది. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి అక్కడ కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక్కో కిడ్నీకి రూ. 20 లక్షలు  ఆశ చూపించి ఇప్పటివరకు 40 మంది కిడ్నీలను అమ్మేశారు.  ఇక్కడికి వచ్చాక కేవలం రూ. 6 లక్షలు మాత్రమే బాధితులకు ఇస్తున్నారు. అదేంటని అడిగితే ఆ ఖర్చులు, ఈ ఖర్చులు చూపించి రూ.6 లక్షలే చేతులో పెడుతున్నారు.  ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా అరాచకాలు బయటకు వచ్చాయి.  

హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువ

కొచ్చిలో వెలుగు చూసిన  ఈ కిడ్నీ రాకెట్ లో సబిత్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.   దాదాపు 40 మంది యువకులను ఇరాన్‌ తరలించి కిడ్నీ దానం చేయించామని, ఇందులో హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో సబిత్‌ వెల్లడించాడు. సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కి మరో ఇద్దరు యువకులు సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు.  మరోవైపు NIA రంగంలోకి దిగింది. కేరళలో నమోదైన FIR ఆధారంగా ముఠాపై కేసు నమోదు చేసి కీలక సూత్రధారి మరో ఇద్దరి కోసం గాలిస్తుంది.