
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ పెరిగిపోయాయని, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసే ప్రతి గొంతును బంధిస్తున్నారని ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీభూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ హెచ్సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను, దానిని కవర్ చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకత్వానికి రాహుల్ సమాధానం చెప్పాలన్నారు. దేశంలోని ఎక్కడకు వెళ్లినా రాహుల్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పత్రికా స్వేచ్ఛ గురించి స్పీచులు ఇస్తుంటారని, కానీ, రాష్ట్రంలో వారి సొంత పార్టీ తీరుపై మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.