భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : గత కొద్ది రోజులుగా జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌ఘడ్‌లో వరుస ఎన్ కౌంటర్లు, మావోయిస్టుల ఎదురుకాల్పుల ఘటనతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సోమవారం పోలింగ్ సజావుగా సాగింది. ఉదయం నుంచే ఏజెన్సీలోని ఓటర్లు ఓటేసేందుకు వచ్చారు. మరో వైపు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చినా.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా జిల్లా పోలీసులు కృషి చేశారు.
జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మావోయిస్టులు జిల్లాలోకి రాకుండా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు, గ్రేహౌండ్స్‌తో కలిసి పోలీసులు అడవిని జల్లెడ పట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పలు పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజుతో పాటు ఓఎస్డీ టి. సాయి మనోహార్ తరుచూ పర్యటించారు. బందోబస్తును పక్కాగా నిర్వహించేలా ఎస్పీ చర్యలు తీసుకున్నారు.