Corbin Bosch: పాకిస్థాన్ సూపర్ లీగ్ వదిలేసి ఐపీఎల్ ఆడడానికి కారణం ఇదే: సౌతాఫ్రికా పేసర్

Corbin Bosch: పాకిస్థాన్ సూపర్ లీగ్ వదిలేసి ఐపీఎల్ ఆడడానికి కారణం ఇదే: సౌతాఫ్రికా పేసర్

పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం సిద్ధమవుతున్న సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కార్బిన్ బాష్ ఇటీవలే ముంబై ఇండియన్స్ గాయపడిన లిజార్డ్ విలియమ్స్ స్థానంలో కొనుగోలు చేసింది. ఈ సారి పాకిస్థాన్ సూపర్ లీగ్, ఐపీఎల్ రెండు ఒకేసారి జరగనున్నాయి. అయితే కార్బిన్ బాష్ మాత్రం ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంత తేలిగ్గా తీసుకోలేదు. అతనికి లీగల్ నోటీసులు పంపించి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరించమని ఈ సఫారీ ఫాస్ట్ బౌలర్‌ను కోరింది. 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పంపిన లీగల్ నోటీసుకు ఈ సఫారీ బౌలర్ స్పందించాడు. తాను ఎందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకొని ఐపీఎల్ ఆడుతున్నాడో వివరణ ఇచ్చాడు. " పాకిస్థాన్ సూపర్ లీగ్ ను అగౌరవపర్చడం నా ఉద్దేశ్యం కాదు. ముంబై ఇండియన్స్ బలమైన ఐపీఎల్ జట్టు మాత్రమే కాదు ఇతర ప్రపంచ లీగ్ ల్లో ఫ్రాంచైజీలను కలిగి ఉంది. దీంతో నేను నా భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చింది. ఇది నా కెరీర్ కు మేలు చేస్తుంది". అని కార్బిన్ బాష్ తెలిపాడు. ఇదిలా ఉంటే తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్, ఐపీఎల్ ఒకేసారి జరగబోతున్నాయి. 

ఐపీఎల్ కు ముందు కార్బిన్ బాష్ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ జట్టు తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ 30 ఏళ్ళ ఫాస్ట్ బౌలర్ డైమండ్ కేటగిరీలో ఆ జట్టు  ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి బోష్ ఐపీఎల్ లో మొదటి ఎవరూ కొనలేదు. ఐపీఎల్ కంటే ముందే అతను పాకిస్థాన్ లీగ్ కు మాత్రం ఎంపికయ్యాడు. ఇటీవలే తన దేశానికే చెందిన ఫాస్ట్ బౌలర్ లిజార్డ్ విలియమ్స్ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతనికి రీప్లేస్ గా ముంబై ఇండియన్స్ బోష్ ను ఎంపిక చేసింది. అనుకోకుండా వచ్చిన ఐపీఎల్ అవకాశాన్ని ఈ సౌతాఫ్రికా పేసర్ వదులుకోవాలనుకోలేదు. పాకిస్థాన్ సూపర్ లీగ్ వద్దనుకుని ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు.