జిల్లాల చరిత్రకు అక్షర రూపం

తెలంగాణ ఎందులోనూ మరే ఇతర ప్రాంతానికి తక్కువ కాదు. నేలను తవ్వినకొద్దీ అపారమైన విద్వన్నిధులు బయల్పడతాయి. సామ్రాజ్యాలనేలిన చక్రవర్తుల రాజ్య విభవమే కాదు కవి పండితులు సృష్టించిన వాజ్మయ సంపద కూడా లభిస్తుంది. ఇక్కడ వెలసిన శిల్పకళా సంపద, దేవాలయాలు, కోటలు, సంగీత, సృత్య, నాటక, జానపదకళారాశి, గ్రామనామాల విశిష్టత, ఉద్యమవీరుల విజయగాథలు ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విశేషాల్ని గ్రంథస్థం చేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. ఆ దిశగా కార్యాచరణ కొనసాగిస్తున్నది. తెలంగాణ చరిత్ర - సంస్కృతి, వారసత్వ సంపద భారతదేశపటంలో చూస్తే రేఖామాత్రం. నిన్నమొన్నటి దాకా కొనసాగిన ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి గొప్పదనమంతా కొంతగానే చూపెట్టారు. దశాబ్దాల విస్మృతి భావన వల్ల కలిగిన అసంతృప్తి నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, అనంతరం జిల్లాల విభజన, తర్వాత అన్ని జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్య ప్రతిభ గురించిన విశేషాలను గ్రంథస్థం చేయడానికి పూనుకున్నాం. పరిషత్తు అధ్యక్షులు, ప్రముఖ పరిశోధకులు డా.ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్యమండలి ఇందుకు ఆమోదం తెలిపింది. ఇక్కడ హైదరాబాద్​లో కూర్చొని ఆయారంగాల నిపుణులతో అక్కడి విశేషాలు రాయించడం కంటే అక్కడి వారితో రాయించడమే సరైందని భావించింది తెలంగాణ సారస్వత పరిషత్తు. అన్ని జిల్లాలకు ఎట్లా వెళ్లడం? తల పెట్టిన కార్యం బృహత్తరమైంది. దీనికి కావలసిన సొంత ఆర్థిక, మానవ వనరులు లేవు అని ఆలోచించకపోలేదు. అయితే స్వాభిమాన పరిరక్షణ కోసం 1943లో వెలసిన సారస్వత పరిషత్తు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా భాషా సాహిత్యరంగాల్లోని వారికి సుపరిచితమే. 

జిల్లాల వారీగా కోర్​ కమిటీలు
1948 నిజాం పాలన అంతరించి తెలంగాణ భారత యూనియన్‌‌‌‌‌‌‌‌లో విలీనమైన తర్వాత 1949లో తూప్రాన్​లో సారస్వత పరిషత్తు సభలు జరిగినప్పుడు తెలుగు మాధ్యమంలో మెట్రిక్ వరకు విద్యాబోధన జరగాలని తీర్మానం చేశారు. అర్హులైన ఉపాధ్యాయులు లేరని ప్రభుత్వం చెప్పింది. 1944 నుంచే సారస్వత పరిషత్తు తెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని నియమించుకోవచ్చని తెలపడం, ప్రభుత్వం అంగీకరించడం, వేలాది మంది ఉపాధ్యాయులుగా నియమితులు కావడం చరిత్ర. అంతే గాకుండా పరిషత్తు1965 నుంచి తెలుగు పండిత శిక్షణ, ప్రాచ్య కళాశాలలు నడుపుతున్నది. ఈ కళాశాలల్లో చదివిన వారు తెలంగాణ నలుమూలలా తెలుగు అధ్యాపకులుగా, కవి, రచయితలుగా ఉన్నారు. ఈ ధైర్యంతోనే జిల్లాల వారిని సంప్రదించాం. మంచి స్పందన వచ్చింది. పరిషత్తులో నేను శిక్షణ పొందాను, నేను పరీక్షలు నిర్వహించాను, గౌరవం పొందాను తప్పకుండా నావంతు తోడ్పాటునందిస్తాను అని ముందుకొచ్చారు. అలా ప్రతి జిల్లా నుంచి కొందరు కన్వీనర్లుగా కోర్​కమిటీలు ఏర్పాటు చేశాం. జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్యం , శాసనాలు, ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు, సంగీత, నృత్య, నాటక, చిత్రలేఖన శిల్ప కళలు, జానపద విజ్ఞానం, జిల్లాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ రంగాల్లో జిల్లాకు పేరు తెచ్చిన ఇతర పెద్దలు, గ్రామనామాలు, విద్య, వైద్య ఆరోగ్యం, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, క్రీడలు. ఇవేగాకుండా ఆయా జిల్లాలకు ప్రత్యేకమైన ఇతర అనేక అంశాలపై వ్యాసాలు రాయడానికి కోర్ కమిటీలు వ్యాసకర్తలను గుర్తించాయి. 

సమగ్ర గ్రంథం
గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లా సమగ్ర స్వరూప గ్రంథాలు ఒక్కొక్కటి సుమారు 400 పుటలతో ఇప్పటికే వచ్చేశాయి. జూన్12 న రాజన్న సిరిసిల్ల జిల్లా ఉత్సవం, జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథం ఆవిష్కరణ జ్ఞానపీఠ్​పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి స్వగ్రామం హనుమాజిపేటలో వారు పుట్టి పెరిగిన ఇంటి ప్రాంగణంలో జరగబోతున్నది. ఆ వెంటనే కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, సిద్దిపేట, పెద్దపల్లి మొదలైన జిల్లాల సమగ్ర స్వరూప గ్రంథాల ఆవిష్కరణ, జిల్లా ఉత్సవం, జిల్లా వైభవంపై కవి సమ్మేళనం వరుసగా జరుగుతాయి. వ్యాసాల రచన ప్రామాణికంగా సాగుతున్నది. వాటి కంపోజింగ్, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ లో నాకు ఆయా జిల్లాల వారు తగిన సహకారం అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ మాకు ఈ ప్రణాళికకే గాక ఇతరత్రా మా కార్యక్రమాలకు నిధులు అందిస్తూనే ఉంది. మా శ్రమ, సంకల్పం ఫలించి33 జిల్లాల అన్ని విశేషాలతో గ్రంథావళి కొద్ది నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం.

- డా.జుర్రు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సారస్వత పరిషత్తు