T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు

 T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు

టీ20 ప్రపంచ కప్ 2024 పోరుకు అగ్రరాజ్యం అమెరికా తమ జట్టును ప్రకటించింది. 31 ఏళ్ల వికెట్-కీపర్/ బ్యాటర్ మోనాంక్ పటేల్ నేతృత్వంలో 15 మంది సభ్యుల గల జట్టును ఎంపిక చేసింది. గాయం కారణంగా కెనడా సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ అలీ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అమెరికా టీమ్ లో న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ కోరీ ఆండర్సన్‌కు చోటు దక్కగా.. అవకాశాల రాక అమెరికా వెళ్ళిపోయిన భారత U19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు నిరాశ ఎదురైంది.

అన్ని దేశాల వారిని కలిపేశారు

పేరుకు అమెరికా జట్టన్న మాటే తప్ప.. సగానికి పైగా ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందినవారే. ఆఖరికి ఆ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ భారత సంతతి యువకుడు. గుజరాత్ రాష్ట్రం తరుపున U16, U19 క్రికెట్ ఆడాడు. ఆ తరువాత అమెరికా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాడు. ఇక డిప్యూటీగా ఎంపికైన ఆరోన్ జోన్స్‌ది.. బార్బడోస్ దీవులు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన భారత యువ క్రికెటర్ మిలింద్ కుమార్ సైతం మెగా టోర్నీలో ఆడనున్నాడు. మరో క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ హర్మీత్ సింగ్.. ఇండియా-బి, రెస్ట్ అఫ్ ఇండియా తరుపున కూడా ఆడాడు.

టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్వి , స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్. 

రిజర్వ్ ప్లేయర్స్: గజానంద్ సింగ్, జువానో డ్రైస్‌డేల్, యాసిర్ మహ్మద్.

జూన్ 12న ఇండియాతో..

జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో అమెరికా.. కెనడాతో తలపడనుంది. అనంతరం జూన్ 06న పాకిస్తాన్‌ను, జూన్ 12న ఇండియాను, జూన్ 14న ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది.