మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్

మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్

జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడం చాలా కష్టం. ఒక వేళ దక్కించుకున్నా.. స్థానం నిలబెట్టుకోవడం అంతకు మించిన కష్టం. టాలెంట్ ఉన్నా.. విపరీతమైన పోటీ వలన సొంత దేశం తరపున చోటు దక్కించుకోపోతే అమెరికా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా క్రికెట్ జట్టులో టీమిండియా బ్యాటర్, మాజీ అండర్ 19 వరల్డ్ కప్ విజేత ఉన్ముక్త్ చంద్ టీమిండియాలో చోటు దక్కపోవడంతో అమెరికా జట్టు తరపున క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ నుంచి మరో స్టార్ ప్లేయర్ USA తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. 
               
న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ కోరీ ఆండర్సన్ రాబోయే T20 ప్రపంచ కప్ 2024లో USA తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ కోసం అమెరికాకు వలస వచ్చిన అనేక మంది క్రికెటర్లలో అండర్సన్ కూడా ఉన్నాడు. కెనడాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అమెరికా జట్టులో అండర్సన్‌కు చోటు దక్కింది. అతను ఐదు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. చివరిసారిగా 2018లో న్యూజిలాండ్ తరపున ఆడాడు. 

ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో ఉన్ముక్త్ చంద్, కోరీ ఆండర్సన్ ఆడటం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.