
తెలంగాణ కురిసిన భారీ వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బతీశాయి. చేతికొచ్చిన మొక్కజొన్న నేల కూలడంతో రైతులు లబోదిబో అంటున్నారు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి వ్యయ, ప్రయాసాలకు లోనయి మొక్కజొన్న పంటను సాగుచేసిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. వర్షాలు పడక ముందే పంటలను చూసి మురిసిన రైతు నిన్న ( సెప్టెంబర్ 21) కురిసిన భారీ వర్షానికి ... పండించిన పంటలను చూసి లబోదిబోమంటున్నారు.
నిర్మల్ జిల్లాలో చాలా చోట్ల నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్న పంట వర్షార్పణమైంది. పలు చోట్ల ఎండబెట్టిన కంకులు, ఆరబోసిన గింజలు తడిసిపోయాయి. ఆరంభ సమయంలో కత్తెరపురుగు తెగులు బెడదతో కలత చెందిన అన్నదాత .. ఇప్పుడు భారీ వర్షంతో పంటలను కాపాడుకోలేకపోయామని.. ప్రభుత్వమే తమ కష్టాన్ని గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.