ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందారు. 179 మందికి పైగా గాయాలయ్యాయి. కోల్‌కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మరో గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఒడిషాలోని బాలాసూర్ జిల్లా బహనగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బోగీలు ఎగిరిపడ్డాయి. అందులోని ప్రయాణికులు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడిపోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు బోగీల్లో చిక్కుకుపోయారు.
అసలేమైంది...
షాలిమార్ నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (12841) మొదట పట్టాలు తప్పింది. -12 బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే కాసేపటి తర్వాత యశ్వంత్‌పూర్-హౌరా రైలు (12864) ట్రాక్‌పై పడిన ఈ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలుకు చెందిన 3-4 బోగీలు కూడా పట్టాలు తప్పాయి.
రైలు ప్రమాదంలో 50 మంది మృతి చెందారని..రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు. 179 మంది గాయపడ్డారని వారిని బాలాసోర్ మెడికల్ కాలేజీకి, సోరో, గోపాల్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఖాంతపాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్నీ ఆస్పత్రుల్లో కలిపి దాదాపు 179 మందికి చికిత్స అందిస్తుండగా.... వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రైలు బోగీల్లో చిక్కుకుపోయిన క్షతగాత్రులను సురక్షితంగా వెలికి తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం బీతావహంగా మారింది. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ పలు జంక్షన్ల కేంద్రాలుగా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది.
HWH Helpline no-033-26382217
KGP helpline no-8972073925, 9332392339
BLS Helpline no-8249591559;7978418322
SHM Helpline no- 9903370746
సమీక్షించిన నవీన్ పట్నాయక్
ఈ విషాదకర ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. విషయం తెలిసిన వెంటనే స్పెషల్ రిలీఫ్ కమీషనర్ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్న ఆయన, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం ఆయన సంఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.
మమత దిగ్భ్రాంతి
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రైలులో బెంగాల్‌కు చెందిన వారు భారీగా ఉంటారని , వారి క్షేమ సమాచారం కోసం ఒడిషా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని మమత తెలిపారు. ఇప్పటికే హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 033-22143526, 22535185 నెంబర్లను సంప్రదించాలని మమతా బెనర్జీ కోరారు. ఘటనాస్థలికి బెంగాల్ నుంచి అధికారులను పంపామని.. సీఎస్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి సహాయక కార్యక్రమాలపై తాను వ్యక్తిగతంగా సమీక్షిస్తానని మమత వెల్లడించారు.
అమిత్ షా సంతాపం
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. NDRF బృందం ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకుందని...ఇతర బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు.
మోదీ సంతాపం
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. “ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైల్వే మంత్రితో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బాధితులకు అన్ని విధాలా సహాయం అందజేస్తున్నాము” అని ప్రధాని ట్వీట్ చేశారు.