గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్..వందల మందికి గాయాలు

 గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్..వందల మందికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. 2023, జూన్ 2వ తేదీ సాయంత్రం 7 గంటల 20 నిమిషాలకు ఒడిశా రాష్ట్రం బాలాసోర్ ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఈ రైలు.. గూడ్స్ రైలును ఢీకొనటంతో.. 3 స్లీపర్ కోచ్ లు వదిలి..మిగిలిన అన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏడు బోగీలు ఒకటికి ఒకటి ఢీకొని భారీగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో 50 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. 170 మందికి పైగా గాయాలు అయ్యాయి.  ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. 

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. రైల్వే అత్యవసర విభాగాలు స్పాట్ కు చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ చెన్నై నుంచి కోల్ కతా వెళుతుంది. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు అధికారులు. రెండు రైళ్లు ఒకే లైన్ లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సిగ్నల్ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు భారీగా ధ్వంసం అయింది. 

క్షతగాత్రులను తరలించేందుకు భద్రక్‌ నుంచి ఐదు అంబులెన్స్‌లను వచ్చాయి. ప్రమాదం కారణంగా బాలాసోర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.  సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు NDRF బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 60 అంబులెన్సులను ఘటనా స్థలానికి తరలించారు.