ఫంక్షన్లు, దావత్‌ల వల్లే కరోనా యాక్టివ్​

ఫంక్షన్లు, దావత్‌ల వల్లే కరోనా యాక్టివ్​
  • ఫంక్షన్లు, దావత్‌ల వల్లే కరోనా యాక్టివ్​
  • ప్రజలు కోవిడ్ రూల్స్ పట్టించుకోవట్లే..
  • ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కేసుల పెరుగుదలకు కారణమిదే
  • ఫీవర్ సర్వేలో కొత్తగా వేల మందికి కరోనా లక్షణాలు 
  • జాగ్రత్తగా లేకుంటే థర్డ్ వేవ్ తప్పదంటున్న హెల్త్ ఆఫీసర్లు

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో ప్రస్తుతం 161 కొవిడ్​యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో ఇక్కడ అత్య ధికంగా 7.5 శాతం పాజిటివిటీ వచ్చింది. హెల్త్ ఆఫీసర్లు ఇచ్చిన తాజా రిపోర్ట్​లో పానగల్లు జనాలు కరోనా రూల్స్ పాటించట్లేదని పేర్కొన్నారు. మాస్కులు పెడ్తలేరని, ఫంక్షన్లు, చావులకు గుమికూడుతున్నారని తెలియజేశారు. ఈ పీహెచ్​సీ పరిధిలో వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు చాలామంది ఉన్నారని చెబుతున్నారు. గత రెండు రోజులు గా మెడికల్ స్టాఫ్ చేసిన ఫీవర్ సర్వేలో ఇక్కడ  117 మందికి కొత్తగా కరోనా లక్షణాలు బయటపడగా, అందరికీ మెడికల్​కిట్లు అందించి అబ్జర్వ్​ చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొమ్ముగూడెంలో ఇటీవల ఓ ఫంక్షన్  తర్వాత వారం రోజుల్లో  115  కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏకంగా ఏడుగురు చనిపోయారు. మేకల తండాలో పెళ్లి వేడుక ద్వారా 23 మందికి కరోనా సోకింది. ముత్యాలమ్మ పండుగ జరుపుకోవడంతో మరో 20 మందికి వ్యాప్తి చెందింది. గేటురేలకాయలపల్లిలో చావుకు అటెండయిన 65 మందికి కరోనా సోకగా ముగ్గురు చనిపోయారు. ఈ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రంగురాళ్లబోడులో ఒకే రోజు 16 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ గ్రామస్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గ్రామాలకు తరచుగా భవన నిర్మాణ పనులకు వెళ్తుంటారు. గుంపెళ్ల గూడెంలో వివాహ వేడుకల ద్వారా 50 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. అందులో 24 మందికి ఒకే రోజు కొవిడ్​ సోకింది.

ఖమ్మం/నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. జనం కొవిడ్​రూల్స్​పక్కన పెట్టేయడంతో ఇదే అదనుగా వైరస్ తన పని తాను చేసుకుపోతోంది. మిగిలిన జిల్లాల సంగతి ఎలా ఉన్నా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాత్రం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లాక్​డౌన్ తర్వాత కనీస జాగ్రత్తలను గాలికి వదిలేయడం, పార్టీలు, ఫంక్షన్లంటూ హడావుడి చేయడం, శుభ, అశుభ కార్యాలకు పరుగులు తీయడం లాంటి కారణాలతో ఈ జిల్లాల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజుకు 300 పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో కేంద్రం ప్రకటించిన అత్యధిక పాజిటివిటీ ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్టయి కేసుల కట్టడిపై దృష్టిపెట్టారు. 

సరిహద్దు లేని మండలాల్లోనూ.. 
మొన్నటి వరకు ఏపీ సరిహద్దుగా ఉన్న మండలాల్లోనే ఎక్కువగా కేసులు వస్తున్నాయని చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆ తర్వాత  ఇతర మండలాల్లో కూడా కేసులు పెరగడాన్ని గుర్తించారు. ఖమ్మం సిటీతో పాటు కామేపల్లి, కారేపల్లి, ఖమ్మం రూరల్, చింతకాని మండలాల్లోనూ పెద్ద సంఖ్యలో కేసులు వచ్చాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఫంక్షన్ల పేరుతో వందలాది మంది ఒక్కచోటుకు చేరడం, మందు పార్టీలు, దావత్ లు చేసుకోవడం వల్లే వ్యాప్తి పెరిగిందని ఆఫీసర్లు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో 584 గ్రామాలుండగా, పట్టణాలు, గ్రామాల్లో కలిపి 1,300కు పైగా టీమ్ లను ఏర్పాటు చేశారు. వాళ్ల ద్వారా ఇంట్లో ఎంత మందికి జ్వరం, జలుబు, ఇతర కోవిడ్ లక్షణాలున్నాయో తెలుసుకుంటున్నారు. ఊళ్లలో ఎక్కడైనా పదికి పైగా యాక్టివ్ కేసులు నమోదైతే ఆ గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 

వెంటాడుతున్న ఎలక్షన్ నీడ 
ఖమ్మం సిటీలో రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా కరోనా వ్యాప్తికి కారణమయ్యాయన్న విమర్శలున్నాయి. ఏప్రిల్ 30న  పోలింగ్ జరగ్గా, మే 3న ఫలితాలు రిలీజయ్యాయి. ఆ టైంలో వందల సంఖ్యలో జనం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ర్యాలీలు, సభలంటూ రోడ్లపై తిరగడం కామన్ అయింది. అప్పుడు కరోనా బారిన పడ్డ చాలామంది ఇంట్లో కుటుంబ సభ్యులకు అంటించారు. ఆ తర్వాత కూడా కేసుల సంఖ్య కంట్రోల్ కాకపోవడానికి ఎన్నికలే కారణమయ్యాయని ఆఫీసర్లు చెబుతున్నారు. 

నల్గొండలో 21 పీహెచ్​సీల పరిధిలో ఎఫెక్ట్
నల్గొండ జిల్లాలో 40 పీహెచ్​సీలు ఉండగా 21 పీహెచ్​సీల పరిధిలో కరోనా ఉధృతి కనిపిస్తోంది. అర్బన్ ఏరియాల్లోని ఆరు సెంటర్లలో 545, రూరల్​ ఏరియాల్లోని 15 పీహెచ్​సీల పరిధిలో 1591 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఆయా చోట్ల పాజిటివిటీ రేటు 2 నుంచి 7.5 దాక నమోదవుతోంది. ఇది క్రమంగా పెరుగుతుండడంతో ఆఫీసర్లు ఒక్కసారిగా అలర్ట్​ అయ్యారు. రెండు రోజుల క్రితం హెల్త్​ సెక్రెటరీ రిజ్వీ హెల్త్​ ఆఫీసర్లతో రివ్యూ చేశాక ఇంటింటి ఫీవర్ సర్వే ప్రారంభించారు. రెండు రోజులపాటు చేసిన సర్వేలో ఇప్పటివరకు 1,912 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశారు. ప్రధానంగా నల్గొండ, మిర్యాలగూడ డివిజన్లలో కరనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మిర్యాలగూడ డివిజన్​కు ఏపీ బార్డర్​తో లింక్​ఉన్నందునే వైరస్ వ్యాప్తి ఎక్కువుందని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న పీహెచ్​సీల పరిధిలోనే కొత్తగా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయని హెల్త్​స్టాఫ్​చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే థర్డ్​వేవ్​ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఫీవర్ సర్వే చేస్తున్నాం
కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ఊర్లల్లో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రెండు సార్లు ఫీవర్ సర్వే చేశాం. వాటి ఆధారంగానే గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు సమన్వయంతో పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సర్వేల కోసం 1,300 టీమ్ లను ఏర్పాటు చేశాం. సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అన్ని పీహెచ్​సీలలో రోజూ 300 కొవిడ్ టెస్టులు చేస్తున్నాం. 10  కేసులకు మించి గ్రామాల్లో యాక్టివ్ కేసులుంటే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 
- డాక్టర్ మాలతి, డీఎంహెచ్​వో, ఖమ్మం