కాశీ యాత్రికుల బస్సు స్టేట్ బోర్డర్‌లో నిలిపివేత: వరంగల్‌కు తరలింపు

కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో కాశీ యాత్రకు వెళ్లి వస్తున్న బస్సును అడ్డగించారు తెలంగాణ పోలీసులు. కాశీ సహా పలు పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్లిన 42 మంది తెలుగు యాత్రికులతో కూడిన బస్సు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా మండగడ గ్రామం వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిచింది. అయితే ఓ వైపు జనతా కర్ఫ్యూతో పాటు మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో దాన్ని అక్కడే అపేశారు. పోలీసులు ఎస్కార్ వాహనం ఇచ్చి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు పంపారు. బస్సులోని యాత్రికులందరిని ఐసోలేషన్‌లో ఉంచి టెస్టులు చేయాలని వైద్య అధికారులు నిర్ణయించారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 341 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరింది. అందులో తొలి పేషెంట్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రోడ్లపైకి ఎవరూ రాకుండా స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండిపోయారు. దీంతో కరోనా ప్రభావిత జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.