ఒకరి శవం.. మరొకరికి
కరోనాతో ప్రైవేట్ హాస్పిటల్లో ఇద్దరి మృతి
తారుమారైన మృతదేహాలు
అంత్యక్రియల చివరి నిమిషంలో గుర్తించిన కుటుంబీకులు
కామారెడ్డి/ఇందల్వాయి, వెలుగు: హాస్పిటల్ సిబ్బంది కారణంగా కరోనాతో మృతిచెందినవారి డెడ్‌బాడీలు తారుమారయ్యాయి. అంత్యక్రియల చివరి నిమిషంలో కుటుంబీకులు గుర్తించడంతో విషయం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారానికి చెందిన హన్మాండ్లు(58) కూడా కరోనాతో అదే హాస్పిటల్లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరూ మృతిచెందారు. శనివారం హాస్పిటల్ స్టాఫ్ మృతదేహాలను ప్యాక్ చేసి కుటుంబీకులకు అప్పగించారు. భిక్కనూరులో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కుటుంబీకులు చివరి నిమిషంలో ముఖం చూసి తమ వ్యక్తి కాదని గుర్తించారు. వెంటనే హాస్పిటల్ దృష్టికి తీసుకెళ్లారు. గన్నారంలోనూ కుటుంబీకులు అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తి చేసి మృతదేహాన్ని చితి మీద పెట్టారు. ఇంతలో హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి డెడ్‌బాడీ మారినట్లు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. హన్మాండ్లు మృతదేహాన్ని హాస్పిటల్ సిబ్బంది కుటుంబీకులకు అప్పగించి మరో వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లారు.
For More News..