నిజామాబాద్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా..

నిజామాబాద్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా..
  • జిల్లా ఆస్పత్రి మొత్తం కరోనా వార్డులుగా మార్పు
  • చాలా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్..  తాజాగా కంటైన్మెంట్ జోన్లు ప్రకటన 

నిజామాబాద్: కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తొలి విడుత కంటే రెండో విడుత సోకుతున్న సెకండ్ వేవ్ కరోనా అత్యంత ప్రమాదకరమని హెచ్చరికలు చేస్తున్నా ప్రజలెవరూ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పటికే జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 22 వేలు దాటడం కలకలం రేపుతోంది. గురువారం జిల్లాలో 157 కేసులు నమోదు కాగా.. శుక్రవారం ఒక్కరోజులోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. శుక్రవారం అధికారికంగా ప్రకటించిన జాబితాలో 303 కేసులు నమోదు కాగా ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లా ఆస్పత్రిలోని అన్ని ఫ్లోర్ లను కరోనా వార్డులు గా మార్చారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తున్నారు. ఈ జోన్లలో లాక్ డౌన్ తరహా నిబంధనలు అమలు చేయడం ప్రారంభించారు. 

ప్రతి ఆరోగ్య కేంద్రంలో  150 టెస్టులు

కేసుల సంఖ్య గత ఏడాది కంటే రెట్టింపు స్థాయిలో పెరుగుతుండడంతో టెస్టుల కోసం వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో అధికారులు జిల్లా ఆస్పత్రితోపాటు ప్రతి ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజు 150 మందికి పరీక్షలు చేస్తుండగా వీటిలో 30 వరకు పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అలాగే వ్యాక్సిన్ కోసం వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఓవైపు టెస్టుల కోసం మరో వైపు వ్యాక్సిన్ కోసం వస్తున్న జనం సంఖ్య పెరుగుతుండగా వారికి తగిన మౌళిక వసతులు కల్పించకపోవడం కష్టాలకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఎండల తీవ్రత ఒక పక్క.. మరో పక్క కేసుల భయం వెంటాడుతుండగా టెస్టుల కోసం... వ్యాక్సిన్ల కోసం బయట ఎండలో వేచి ఉండాల్సి వస్తోంది. తాగునీటి వసతి కూడా ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. 

చాలా గ్రామాల్లో స్వచ్చంద లాక్ డౌన్

కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనబడుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు. మోపాల్ మండల కేంద్రంలో గత 20 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అలాగే బోధన్ మండాలం సాలూరా, సాలూరా క్యాంప్ లలో గత వారం రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో  లాక్ డౌన్ ప్రకటించుకున్నారు  గ్రామస్థులు. కోటగిరి మండలం సుంకిని, వర్ని మండాలం సిద్దాపూర్ గ్రామాల్లోనూ లాక్ డౌన్ విధించారు. ఈ గ్రామాల్లో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఎవరు రావోద్దని, దుకాణాలు కూడా ఉదయం 10 గంటలకే మూసేయాలని, శుభకార్యాలు వాయిదా వేయాలని, చావులకు 10 మందికి మించి వెళ్లొద్దని తీర్మానించుకున్నారు ఆయా  గ్రామస్థులు. 

మహారాష్ట్ర సరిహద్దులు మూసేసినా తగ్గని కేసులు 
మహారాష్ట్రలో ప్రమాద కర పరిస్థితులను గుర్తించి సరిహద్దులు మూసేసినా జిల్లాలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ జిల్లా చాలా వరకు మహరాష్ట్ర సరిహద్దు కలిగి ఉండడంతో వైరస్ జిల్లాలో పూర్తిగా విస్తరించింది. ఇప్పటికే నిజామాబాద్ నగరంలో కరోనా కోరలు చాస్తూ తన ప్రభావాన్ని చూపుతోంది. వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు....ఇలా అన్ని చోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జనం బయటకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు, చావులు వంటి కార్యక్రమాలకు జనం ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమిగూడుతుండడంతో కేసులు నమోదవుతున్నాయి.  చెక్ పోస్టుల వద్ద సరైన తనిఖీలు, కట్టడి చర్యలూ లేకపోవటం వల్ల మహరాష్ట్ర నుండి వచ్చే వారు చాలా సులభంగా జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మరోపక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల సంఖ్య కూడా పెంచటంతో కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి.

     
బోధన్ డివిజన్లో ఎక్కువ కేసులు
జిల్లాలోని బోధన్ డివిజన్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు కావటం ప్రధాన కారణంగా భావిస్తున్నారు అధికారులు. శాటాపూర్ లో ప్రతి శనివారం మేకల సంత జరుగుతుంది. పలు రాష్ట్రాల నుండి మేకల కొనుగోలు దారులు, వ్యాపారులు ఇక్కడికి వేల సంఖ్యలో వస్తారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ శనివారం నుండి సంతను రద్దు చేస్తూ పంచాయతీ పాలక మండలీ తీర్మానం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నిజామాబాద్ మార్కెట్ యార్డు  టైమింగ్స్ లో కూడా మార్పులు చేసారు. ఉదయం 8 గంటల వరకే యార్డులోకి అనుమతిస్తున్నారు. మాక్లూర్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ఎంపిడిఓ ప్రకటించారు. ఈ గ్రామంలో ఇప్పటికే 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమ్తంగా ఉండాలని, మాస్కులు దరించాలని, బౌతిక దూరం పాటించాలని సూచించారు అధికారులు. నందిపేట మండలంలో కూడా కేసుల సంఖ్య అధికంగా ఉండాటాంతో నాల్గు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులు. నందిపేట మండాల కేంద్రంలోని రాజ్ నగర్, రాంనగర్ తో పాటు మేజర్ పంచాయితీలైన వెల్మల్, వన్నేల్ (కె) గ్రామాలను కంటైన్మెంట్ జోన్లలొ ఉంచారు. ఆర్మూర్ నియోజక వర్గ కేంద్రంలో నాల్గు కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులు. మెండోడా మండాలం సావెల్, మోర్తాడ్ మండాలం సుంకేట గ్రామాల్లో కేసులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. బోధన్ జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం 54 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ కేవలం 50 పడకలు మాత్రమే ఉన్నాయి. దీంతో పడకల సర్దుబాటుపై దృష్టి సారించారు అధికారులు. జిల్లా ఆసుపత్రిగా ప్రకటించినా సౌకర్యాలు మాత్రం ఏరియా ఆసుపత్రి కన్నా హీనంగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.