- కొత్తగా 213 మందికి పాజిటివ్.. ఒకరు మృతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నయి. పోయినవారం రోజుకు సగటున 150 కేసులు నమోదుకాగా, ఈ వారంలో సగటున రోజూ 190 కేసులు రికార్డయ్యాయి. శనివారం ఒక్కరోజే రెండొందలకుపైగా కేసులు వచ్చాయని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 39,495 మందికి టెస్టులు చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌లో 72 మందికి, జిల్లాల్లో 141 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,76,787కి పెరిగిందన్నారు. ఇప్పటివరకు 6,69,010 మంది కోలుకున్నారని, రాష్ట్రంలో మరో 3,998 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. కరోనాతో శనివారం ఒకరు చనిపోయారని, మృతుల సంఖ్య 3,998కి పెరిగిందని పేర్కొన్నారు.
విదేశీ కేసులు రికార్డు కాలే: డీహెచ్
ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న 11 దేశాల నుంచి శనివారం రాష్ట్రానికి 70 మంది వచ్చారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో ఎవరికీ పాజిటివ్ రాలేదని చెప్పారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చి, టిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న 13 మంది హెల్త్ స్టేబుల్‌గా ఉందని తెలిపారు. వీరికి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా వ్యాక్సిన్‌కు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. శనివారం 3 లక్షల 14 వేల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.