మళ్లీ మాస్క్ తప్పనిసరి చేసిన మూడు రాష్ట్రాలు
కరోనా పెరగడంతో హర్యానా, కేరళ, పుదుచ్చేరిలో ఆంక్షలు
దేశంలో కొత్తగా 5,357 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కరోనా రూల్స్ మళ్లీ అమల్లోకి వస్తున్నాయి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. హర్యానా, కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వాలు మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి. స్కూళ్లు, పబ్లిక్ ప్లేసులలో మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా కరోనా రూల్స్ అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు తప్పనిసరిగా రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేసింది.
పబ్లిక్ ప్లేసులలో మాస్క్ తప్పనిసరి చేస్తూ పుదుచ్చేరి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పింది. హాస్పిటళ్లు, హోటళ్లు, లిక్కర్ షాప్స్, ప్రభుత్వ ఆఫీసులు తదితర ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది. ఇక గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నోళ్లు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని కేరళ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 60 ఏండ్లు పైబడినోళ్లు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నోళ్లే కరోనాతో ఎక్కువగా చనిపోతున్నారని హెల్త్ మినిస్టర్ వీణ జార్జ్ చెప్పారు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ సర్కార్ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. టెస్టుల సంఖ్య పెంచాలని, పాజిటివ్ శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని పేర్కొంది. ఆస్పత్రుల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది.
3.39 శాతానికి పాజిటివ్ రేటు..
దేశంలో కొత్తగా 5,357 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.47 కోట్లకు చేరగా, యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు పెరిగిందని వెల్లడించింది. వైరస్ తో మరో 11 మంది చనిపోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,965కు పెరిగిందని పేర్కొంది. గుజరాత్ లో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్ లో ఇద్దరు, బీహార్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని వివరించింది. పాజిటివ్ రేటు 3.39 శాతానికి పెరిగిందని, రికవరీ రేటు 98.74 శాతంగా, డెత్ రేటు 1.19 శాతంగా నమోదైందని చెప్పింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.