హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సగం జిల్లాల్లో కరోనా కంట్రోల్‌లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. సుమారు 10 జిల్లాల్లో రోజూ ఒకట్రెండు కేసులే నమోదవుతుండగా మరో 7 జిల్లాల్లో రోజూ 2 నుంచి 3 కేసులు రికార్డవుతున్నట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వారం రోజుల్లో అత్యల్పంగా నారాయణపేట్ జిల్లాలో ఒక్కరికే పాజిటివ్ వచ్చింది. అసిఫాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాల్లో మూడేసి కేసులు వచ్చాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో రోజూ యాభైకి పైగా కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో సగటున రోజూ పదికిపైగా కేసులొస్తున్నాయి. మిగతా జిల్లాల్లో రోజూ 5 నుంచి 10 కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా సగటున రోజూ 200 కేసులు వస్తుండగా ఒకరు లేదా ఇద్దరు మరణిస్తున్నట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటిస్తోంది.
కొత్త కేసులు 162
రాష్ట్రంలో ఆదివారం 33,506 మందికి టెస్టులు చేస్తే 162 మందికి పాజిటివ్ వచ్చిందని బులెటిన్‌లో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 55, జిల్లాల్లో 107 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసులు 6,67,887కు చేరగా ఇందులో 6,59,722 మంది కోలుకున్నట్టు చూపించారు. మరో 4,235 యాక్టివ్ కేసులుండగా వీరిలో 1,852 మంది ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కరోనాతో ఆదివారం మరొకరు చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 3,930కి చేరిందని వెల్లడించారు.