- ముద్దులు, హగ్గులు అసలే వద్దు
- వీధుల్లో మైకులు పట్టుకుని హెల్త్ వర్కర్ల ప్రచారం
షాంఘై: చైనాలో మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ దేశ ఫైనాన్షియల్ హబ్ షాంఘైలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో వైరస్ విస్తరించకుండా లాక్డౌన్ ప్రకటించారు. జనాలు బయట తిరగకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే, భార్యాభర్తలను కలిసి నిద్రపోవద్దని, కలిసి భోజనం చేయొద్దని, చివరికి ఒకరికొకరు ముద్దులు కూడా పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి వీధుల్లో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ప్రచారానికి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తలుపులు, కిటికీలు తెరవొద్దని, పాటలు పాడొద్దని, స్వేచ్ఛ కోసం మీ కోరికలను కంట్రోల్ చేసుకోవాలని సూచిస్తూ ఈ అనౌన్స్మెంట్లు సాగుతున్నాయి. అలాగే హెల్త్ కేర్ వర్కర్లు మెగా ఫోన్లు పట్టుకుని ‘‘ఈ రోజు రాత్రి నుంచి, భార్యాభర్తలు విడివిడిగా పడుకోండి. ముద్దులు పెట్టుకోవద్దు, హగ్స్ కు అనుమతి లేదు. తినడం కూడా వేర్వేరుగానే. మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ ప్రచారం చేశారు. తమకు సరైన సౌలతులు, ఆహారం అందించకపోవడంపై కొందరు రెసిడెంట్లు తమ బాల్కనీల నుంచే నిరసన తెలుపుతున్నారు. మరోవైపు వారం క్రితం నాలుగు కాళ్ల రోబోలు షాంఘైలో పెట్రోలింగ్నిర్వహిస్తున్న వీడియోలు కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి.
మనదేశంలో కొత్త కేసులు 1,033
మన దేశంలో కొత్తగా 1,033 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసులు 4.30 కోట్లకు పైగా పెరిగాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 11,639కు పెరిగాయని, ఇది టోటల్ ఇన్‌ఫెక్షన్ రేటులో 0.03 శాతమని పేర్కొంది. వైరస్‌తో మరో 43 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 5,21,530కు చేరాయని చెప్పింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వెల్లడించింది. డైలీ పాజిటివిటీ రేటు 0.21% ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా 185.20 కోట్లకు పైగా డోసులు వేసినట్లు వెల్లడించింది.