ఆ జిల్లాల్లో మాత్రమే ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్
హుజూరాబాద్‌లోనూ రెండు డోసులు
డీఎంహెచ్‌వోలకు సర్కారు ఉత్తర్వులు
21 జిల్లాల్లో ఫస్ట్ డోస్ బంద్.. కేవలం సెకండ్ డోస్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని 12 జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ఆ జిల్లాల్లో మాత్రమే వ్యాక్సిన్ ఫస్ట్, సెకండ్ డోస్ వేయాలని ఆదేశాలిచ్చారు. మిగతా 21 జిల్లాల్లో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌ను బంద్ పెట్టి కేవలం సెకండ్ డోస్ వేయాలని ఆదేశిస్తూ డీఎంహెచ్‌వోలకు శనివారం ఉత్తర్వులిచ్చారు. కాదని ఫస్ట్ డోస్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే కేసులు పెరుగుతున్న 12 జిల్లాల్లో కొవ్యాగ్జిన్‌ను ఫస్ట్ డోస్‌గా వేయొద్దన్నారు. వ్యాక్సిన్ల కొరత, కొవ్యాగ్జిన్ సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్నోళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ కేసులు పెరుగుతున్నాయని, అక్కడా రెండు డోసులనూ కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కోటీ 10 లక్షల 68 వేల 414 డోసుల వ్యాక్సిన్ వేశారు. 81 లక్షల 30 వేల 900 మందికి ఫస్ట్ డోస్, 29 లక్షల 37 వేల 514 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ నెల రోజుల్లోనే 40 లక్షల మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. ఇంకో కోటిన్నర మందికి ఒక్క డోస్ కూడా అందలేదు.
రాష్ట్రంలో 647 కేసులు.. ఇద్దరు మృతి
రాష్ట్రంలో మరో 647 మంది కరోనా బారిన పడ్డారు. శనివారం 1,20,213 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్‌లో 81 మందికి, జిల్లాల్లో 566 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,40,659కి చేరగా, ఇందులో 6,27,254 మంది కోలుకున్నట్టుగా చూపించారు. ఇంకో 9,625 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో 3,844 మంది హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నట్టు చూపించారు. కరోనాతో శనివారం మరో ఇద్దరు చనిపోయారని, వీరితో కలిపి మృతుల సంఖ్య 3,780కి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు.