దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇండియాలో వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. అమెరికాలో కన్నా ఇండియాలో 3 రెట్ల కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2,61,500 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య కోటి 47 లక్షల 88 వేల 109కి చేరింది. శనివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 1501 మంది కరోనాతో చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,77,150కి చేరింది. శనివారం నమోదైన కరోనా కొత్త కేసులతో ప్రస్తుతం దేశంలో 18 లక్షల 1316 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అదేవిధంగా శనివారం దేశవ్యాప్తంగా 1,38,423 మంది డిశ్చార్జ్ కాగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య కోటి 28 లక్షలు దాటింది. ఐసీఎంఆర్ ప్రకారం శనివారం 15,66,394 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టుల సంఖ్య 26 కోట్ల 65 లక్షల 38 వేలు దాటింది.
ఈ సెకండ్ వేవ్‌లో మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 24,375 మందికి కరోనా సోకగా... 167 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ప్రస్తుతం 69 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ ఢిల్లీలో 11,960 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 67,123 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 6.47 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. శనివారం మహారాష్ట్రలో 419 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 59,970కి చేరింది.