ప్యారిస్: కొద్ది రోజులుగా ఫ్రాన్స్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒకే రోజు 95 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారని అక్కడి వ్యాక్సినేషన్ డ్రైవ్ చీఫ్ లైన్ ఫిషర్ వెల్లడించారు. తాము కరోనా కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నామని, ఇంకింత వ్యాప్తి పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ కేసులు 2 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని సూచించారు. అయితే, ఒమిక్రాన్ సబ్ వేరియంట్లయిన బీఏ4, బీఏ5 వేగంగా వ్యాపిస్తుండటం వల్లే యూరోపియన్ దేశాలలో కేసులు పెరుగుతున్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ తెలిపింది. మే నెలాఖరులో 17 వేలలో ఉన్న డైలీ కేసులు నాలుగువారాల్లో 70 వేలు దాటాయి. అయితే, ఇప్పటివరకు ఆస్పత్రుల్లో చేరేవాళ్ల సంఖ్య, మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది.
మన దేశంలో 13 వేలు దాటినయ్
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒకే రోజు 13,313 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ముంబై సిటీలో అంతకుముందు రోజు కంటే 50 శాతం ఎక్కువ మంది వైరస్ బారిన పడ్డారని, దీంతో మహారాష్ట్రలో 5,218 కేసులు నమోదయినట్లు పేర్కొంది. వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,44,958కి చేరుకుంది. గడిచిన ఒక రోజులో 38 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,24,941కి చేరుకుంది. డైలీ పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 3.94 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.90 శాతం, రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,972 మంది డిశ్చార్జి కాగా, వైరస్ బారిన పడినోళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు 83,990 కు పెరిగాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం ఒకరోజులో దేశవ్యాప్తంగా 12.32 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని, వీటితో కలిపి మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 196.62 కోట్లు దాటిందని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ బులెటిన్‌లో వెల్లడించింది.