ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. ఒక్కసారిగా 75 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 3775 శాంపిల్స్ టెస్ట్ చేయగా..75 పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మరణించారని చెప్పింది. గుంటూరులో 15, కృష్ణా జిల్లాలో 10, విశాఖపట్నంలో ఇద్దరు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పేషెంట్ల సంఖ్య 722కు చేరింది. ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 92 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 174 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 149 మంది కరోనా బారినపడ్డారు. కృష్ణా జిల్లాలో 80, నెల్లూరులో 67, చిత్తూరులో 53, ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా సోకింది. కడప జిల్లాలో 40, పశ్చిమ గోదావరి జిల్లాలో 35, అనంతపురం జిల్లాలో 33, తూర్పు గోదావరి జిల్లాలో 26, విశాఖపట్నంలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదు.