ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,171 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 89 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం క‌రోనా బారినపడిన వారి సంఖ్య 2,06,960కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు 434 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 7,594 మంది కరోనాను జయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,20,464 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 84,654 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. చిత్తూరులో 10 మంది, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించారు. కడప, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురి చొప్పున, కృష్ణా జిల్లాలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఐదుగురి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1842కు చేరింది. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,938 శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటి వరకు 23,62,270 మందికి కరోనా పరీక్షలు చేశారు.