దేశంలో కరోనా వైరస్ విజృంభణ తగ్గడం లేదు. రెండు మూడ్రోజులుగా వరుసగా 1800 పైచిలుకు కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనూ 1823 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక్క రోజులో 67 మంది ఈ వైరస్ కు బలయ్యారు. గురువారం సాయంత్రం ఐదు గంటల బులిటెన్ లో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇవాళ వచ్చిన కొత్త కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 33,610కి చేరింది. అందులో 1075 మంది మరణించగా.. 8373 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 24,162 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్రం ప్రకటించింది.
సగానికి పైగా కేసులు ఆ మూడు రాష్ట్రాల్లోనే
దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా (51.8 శాతం) మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలో మొత్తం కేసులు 33,610 ఉండగా.. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీల్లో కలిపి 17,436 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 63 శాతం ఈ మూడు రాష్ట్రాల్లోనే సంభవించాయి. దేశంలో ఇప్పటి వరకు 1075 మంది మరణించగా.. ఈ రాష్ట్రాల్లో 685 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేసులు ఎక్కువగా ఉన్న తొలి పది రాష్ట్రాలు
రాష్ట్రం మొత్తం కేసులు కోలుకున్న వారు మరణాలు
మహారాష్ట్ర 9915 1593 432
గుజరాత్ 4082 527 197
ఢిల్లీ 3439 1092 56
మధ్యప్రదేశ్ 2660 461 130
రాజస్థాన్ 2438 768 51
ఉత్తరప్రదేశ్ 2203 513 39
తమిళనాడు 2162 1210 27
ఆంధ్రప్రదేశ్ 1403 321 31
తెలంగాణ 1012 367 26
పశ్చిమ బెంగాల్ 758 124 22